ఒకే మండపంలో ముగ్గుర్ని పెళ్లి చేసుకున్న మాజీ సర్పంచ్

ఒకే మండపంలో ముగ్గుర్ని పెళ్లి చేసుకున్న మాజీ సర్పంచ్

భోపాల్ : ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఒకేసారి ఏకంగా ముగ్గుర్ని పెళ్లి చేసుకున్నాడు భోపాల్కు చెందిన ఓ వ్యక్తి. 15ఏళ్లుగా ఆ ముగ్గురితో సహజీవనం చేస్తున్న ఆయన ఒకే మండపంలో వారి మెడలో మూడు ముళ్లు వేశాడు. తమ పిల్లల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి తంతు నిర్వహించారు. మధ్యప్రేదశ్లో గిరిజనులు అత్యధికంగా నివసించే అలిరాజ్పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

అలిరాజ్‌పూర్ జిల్లాలోని నాన్‌పూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ సామ్రాత్ మౌర్య (40) నన్‌ బాయి, మేళా, సక్రితో  అనే ముగ్గురు మహిళలతో సహజీవనం చేస్తున్నాడు. తాజాగా ఆ ముగ్గురిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న ఆయన గిరిజన సాంప్రదాయం ప్రకారం మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా వివాహ తంతు పూర్తి చేసుకున్నాడు. ఏప్రిల్ 30న జరిగిన ఈ పెళ్లి వేడుకలో ఆయన ముగ్గురు కూతుళ్లు, ముగ్గురు కొడుకులు కూడా పాల్గొన్నారు. 

2003లో నన్ బాయితో పరిచయం కాగా.. మేళాతో 10ఏండ్ల నుంచి సహజీవనం చేస్తున్నాడు. నాలుగేళ్ల క్రితం మూడో భార్య సక్రితో ప్రేమలో పడ్డట్లు మార్య చెప్పాడు. ముగ్గురి భార్యల్లో ఒకరు స్కూల్లో ప్యూన్‌గా పనిచేస్తుండగా.. మిగిలిన ఇద్దరు వ్యవసాయంతో పాటు ఇంటి పనులు చూసుకుంటున్నారు.