మాస్టారు..మాస్టారు.. మా మంచి మాస్టారు
ఎడ్లబండిపై డప్పుల చప్పుళ్లతో ఊరేగిస్తూ తీసుకెళ్తున్న ఈ వ్యక్తి పేరు సోమనర్సయ్య. మహబూబాబాద్ లోని ఇనుగర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు మాస్టారిగా పనిచేస్తూ ఈ మధ్యే రిటైరయ్యారు. ఇన్నాళ్లు తమకి పాఠాలు చెప్పిన మాస్టారి పదవీ విరమణని ఓ వేడుకలా సెలబ్రేట్ చేశారు స్టూడెంట్స్.
మహబూబాబాద్, వెలుగు: శ్రద్ధ చూపకపోతే ఎంతో మంది విద్యార్థులను బెత్తం దెబ్బలతో మందలించాడు… వారు ఎదిగితే ఉప్పొంగిపోయాడు. డీలాపడితే తాను కూడా నిరుత్సాహపడ్డాడు… చదువు విలువను విడమర్చి చెప్పాడు. జీవిత పాఠాలు విపులంగా నేర్పించాడు. అలాంటి మాస్టారు రిటైర్ అవుతుంటే విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంటుంది. తమకు జీవితాన్నిచ్చిన టీచర్ కు పూలమాలల సత్కారంతో సరిపెడితే ఎలా? అందుకే ఈ స్కూల్ విద్యార్థులు తమ మాస్టారి పదవీ విరమణని ఇలా డిఫరెంట్గా ప్లాన్ చేశారు. డప్పుల చప్పుళ్లతో, ఎడ్లబండి మీద ఊరేగిస్తూ మాస్టారికి ఘనంగా వీడ్కోలు చెప్పారు. పదవీ విరమణని ఓ మరపురాని గుర్తుగా మార్చారు. ఆ ఆలోచన రావడమే ఆలస్యం తెలుగుదనం ఉట్టిపడేలా కొబ్బరి మట్టలతో ఎడ్లబండిని అందంగా ముస్తాబు చేశారు. డప్పుల చప్పుళ్లతో మాస్టారి పదవీ విరమణని ఓ పండుగలా సెలబ్రేట్ చేశారు. ఈ పండుగకి ఊరంతా కదిలి రావడం మరో విశేషం. విద్యార్థులతోపాటు గ్రామస్తులు తనపై చూపిస్తున్న ప్రేమ చూసి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు మాస్టారు. పిల్లలు కూడా మాస్టారు లేని స్కూల్ని ఊహించుకోలేమంటూ బాధపడ్డారు. ఈ గురు శిష్యుల అనుబంధం చూసి అందరూ మెచ్చుకుంటున్నారు.
జీవితానికి ఇది చాలు
పాతికేళ్లుగా తెలుగు పాఠాలు చెప్తున్నా… ఎనిమిదేళ్లుగా ఇనుగుర్తిలో పనిచేస్తున్నా… నా టీచింగ్ ప్రొఫెషన్లో ఎంతోమంది విద్యార్థులను చూశా… ఓ మాస్టారిగా నా విద్యార్థుల జీవితం బాగుండాలని ప్రతి నిమిషం ఆలోచిస్తుంటా… అందుకోసం నేను ఏం చేయగలనో అదే చేశా… జీవితంలో ఎలా మెలగాలో నేర్పా… నీతి, నిజాయితీలు జీవితంలో ఎంత ముఖ్యమో చెప్పా… కానీ, ఇకనుంచి నేను పాఠాలు చెప్పాలనుకున్నా వినడానికి నా స్టూడెంట్స్ ఉండరు… అది తలుచుకుంటే బాధగా ఉంది.. కానీ, వీళ్లు చూపిస్తున్న అభిమానం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది… ఈ రిటైర్మెంట్ వేడుక నా జీవితంలో ఎప్పటికీ ఓ తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుంది. పంజాల సోమనర్సయ్య, రిటైర్డ్ తెలుగు ఉపాధ్యాయుడు.
