బ్లాస్టింగ్ భయంఇండ్లు ఆగం! ఓసీపీల పేలుళ్లతో బిక్కుబిక్కుమంటున్న సమీప గ్రామాల ప్రజలు

బ్లాస్టింగ్ భయంఇండ్లు ఆగం! ఓసీపీల పేలుళ్లతో బిక్కుబిక్కుమంటున్న సమీప గ్రామాల ప్రజలు
  • బ్లాస్టింగ్​ల రాళ్లు తగిలి ఇండ్లు ధ్వంసం, పలువురికి గాయాలు సమస్యపై పట్టించుకోని 
  • స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు 
  • భూములు, కొన్ని ఇండ్లను తీసుకొని పూర్తి పరిహారమివ్వని సింగరేణి  
  • శాశ్వత పరిష్కారం చూపాలంటున్న బాధిత గ్రామాల ప్రజలు

పెద్దపల్లి, వెలుగు: ఓపెన్​కాస్ట్(ఓసీ) ప్రాజెక్టులతో సమీప గ్రామాల్లోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితి నెలకొంది. ఓసీల్లో భారీ బ్లాస్టింగ్ ల కారణంగా పెద్ద పెద్ద బండరాళ్లు ఎగిరొచ్చి పడుతుండగా ఇండ్లు ధ్వంసమవుతు న్నాయి. ప్రజలకు కూడా తగులుతుడడంతో గాయాలపాలవుతున్నారు. ఇంకోవైపు తీవ్ర పొల్యూషన్​ఏర్పడుతుండగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమస్యపై స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు.

దశాబ్దాలుగా ఓసీ సమీప గ్రామాల్లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. బ్లాస్టింగ్ సమస్యపై బాధితులు కోర్టుకెళ్లినా శాశ్వతంగా పరిష్కారం చూపడంలేదు. ఇటీవల పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని సింగరేణి ఓపెన్ కాస్ట్ –2 బొగ్గు గనిలో మట్టి తవ్వకాల కోసం బ్లాస్టింగ్​చేశారు. దీంతో పెద్ద పెద్ద బండరాళ్లు ఎగిరొచ్చి సమీప గ్రామాల్లోని ఇండ్లపై పడ్డాయి. పలు ఇండ్లు ధ్వంసం కావడంతో పాటు రాళ్లు తగలడంతో కొందరు గాయపడ్డారు. 

ఇండ్లను కూడా తీసుకోవాలే..

రామగిరి మండలం ఆర్జీ–3 ఓపెన్​కాస్ట్ –2 విస్తరణలో భాగంగా నాగేపల్లి, లద్నాపూర్, రాజాపూర్, పన్నూర్, ఆదివారం పేట గ్రామాల్లోని వ్యవసాయ భూములతో పాటు హ్యాబిటేషన్లను సింగరేణి తీసుకుని.. వివిధ దశల్లో పరిహారం కూడా చెల్లించింది. అయితే.. కొన్ని ఇండ్లను తీసుకుని..  మరికొన్ని తీసుకోలేదని గ్రామాల ప్రజలు చెప్తున్నారు. ​ఓసీపీని విస్తరించుకుంటూ గ్రామాల వద్ద వచ్చింది. దీంతో బ్లాస్టింగ్​చేసినప్పుడు బండరాళ్లు, దుమ్ము, దూళితో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతుండడంతో పాటు ఆస్తినష్టం కూడా వాటిల్లుతుంది. 

భూముల తీసుకున్న చాలా మందికి ఇంకా సింగరేణి పునరావాసం కల్పించలేదు. దీంతో బాధితులు ఎన్నోసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం చూపడంలేదు.  చివరకు పరిహారం కోసం కోర్టును కూడా ఆశ్రయించారు. గతంలో చాలాసార్లు ఇండ్లను ఖాళీ చేయించడానికి సింగరేణి అధికారులు ప్రయత్నాలు చేశారు. అయితే.. పూర్తి నష్టపరిహారం ఇచ్చేవరకు ఖాళీ చేయమని బాధిత గ్రామాల ప్రజలు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికైనా సింగరేణి అధికారులు సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషి చేయాలని బాధిత గ్రామాల ప్రజలు కోరుతున్నారు. 

బ్లాస్టింగ్​ జరిగినప్పుడల్లా..

బ్లాస్టింగ్ ధాటికి ఓసీపీ సమీప గ్రామాలైన నాగేపల్లి, లద్నాపూర్, రాజాపూర్, పన్నూర్, ఆదివారం పేట గ్రామాల్లో భూమి కంపించిపోతుంది. బ్లాస్టింగ్​జరిగిన ప్రతిసారి ఇండ్ల నుంచి బయటకు ప్రజలు పరుగులు తీస్తున్నారు. చాలా ఇండ్లకు బీటలు పడడంతో పాటు రేకులు పగిలిపోతున్నాయని ఆయా గ్రామాల ప్రజలు చెప్తున్నారు. రూల్స్ కు విరుద్ధంగా ప్రైవేటు ఓబీ కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా మైనింగ్ కార్యకలాపాలు చేస్తుండడంతో స్థానిక గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 బ్లాస్టింగ్​ద్వారా వెలువడే దుమ్ము, ధూళితో రోగాల బారిన పడుతున్నారు. ఈ సమస్యపై పొల్యూషన్​బోర్డు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, మైనింగ్ చట్టాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న సంబంధిత కాంట్రాక్టర్లు, అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు తమకు శాశ్వత పరిష్కారం చూపాలని బాధిత గ్రామాల ప్రజలు కోరుతున్నారు.