గుడి కడుతున్నమని ఊళ్లెకు శవాన్ని రానియ్యలే

గుడి కడుతున్నమని ఊళ్లెకు శవాన్ని రానియ్యలే

ఇల్లందు వెలుగు: మూఢనమ్మకాలతో అమాయకులను వేదనకు గురిచేస్తున్న ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. గుడి కడుతున్నామని.. గ్రామంలోకి శవాన్ని తీసుకొస్తే అరిష్టమని మృతదేహాన్ని పొలిమేరల్లోనే అడ్డుకున్న ఉదంతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. ఇల్లందు మండలం నెహ్రూనగర్ తండాకు చెందిన భూక్యా కుమార్ (50)కు ఇద్దరు భార్యలు, ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకు. ఇద్దరు బిడ్డల పెండ్లిలకు చేసిన అప్పులు తీర్చేందుకు రెండో భార్య సరోజతో కలిసి హైదరాబాద్‌‌ వచ్చి పనులు చేసుకుంటున్నారు. పెద్ద భార్య భద్రమ్మ ఊర్లో ఉంటూ వ్యవసాయం చూసుకుంటున్నారు. కొన్నాళ్ల కిత్రం కుమార్‌‌కు బ్రెయిన్‌‌ ట్యూమర్‌‌ వచ్చింది. అనారోగ్యానికి గురైన అతను హైదరాబాద్‌‌లో చికిత్స పొందుతూ గురువారం చనిపోయాడు. మృతదేహాన్ని తీసుకొని కుటుంబ సభ్యులు స్వగ్రామం బయల్దేరారు. వీరు వస్తున్న విషయం తెలుసుకున్న తండా పెద్దలు గ్రామంలోకి రాకుండా పొలిమేరలోనే అడ్డుకున్నారు. అమ్మవారి ఆలయం నిర్మాణంలో ఉందని.. శవాన్ని గ్రామంలోకి తీసుకొస్తే అరిష్టమన్నారు. మీరు మృతదేహాన్ని తీసుకొస్తే మళ్లీ శాంతి పూజలు చేయడానికి లక్షల్లో ఖర్చు అవుతుందని పూజారులు చెప్పారన్నారు. గుడి కట్టేందుక ఇప్పటికే లక్షలు ఖర్చు చేశామన్నారు. పొలిమేరల్లో ఉంచి మీ పొలాల వద్ద అంతిమ సంస్కారాలు చేసుకోవాలన్నారు. దీంతో చేయాలో తెలిక ఆ కుటుంబం తీవ్ర ఆవేదనలో మృతదేహాన్ని గ్రామ పొలిమేరల్లో మహబూబాద్‌‌ మెయిన్‌‌ రోడ్డు పక్కన ఉంచారు. చివరి చూపుకోసం బంధువులు, సన్నిహితులు అక్కడికే వెళ్లారు. వారి పొలం వద్ద అంతిమ సంస్కారాలు నిర్వహించారు.