శివ్వంపేట, వెలుగు: శివ్వంపేట మండలంలోని పోతుల బోగడ గ్రామ శివారులో ఉన్న సుగుణ పౌల్ట్రీ ఫుడ్ కంపెనీ నుంచి వ్యర్థ జలాలు వదలడం తో గ్రామంలోకి దుర్వాసన వస్తోందని, అది భరించలేక పోతున్నామంటూ గ్రామస్తులు బుధవారం సుగుణ పౌల్ట్రీ ఫుడ్ కంపెనీ ఎదుట ధర్నా చేశారు. కంపెనీ వ్యర్థ జలాలు చెరువులోకి వదులుతున్నారని, పశువులు ఆ నీళ్లు తాగలేకపోతున్నాయన్నారు.
చెరువులో నీరంతా కలుషితంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దుర్వాసనకు ఇంట్లో ఉండలేకపోతున్నామని, భోజనం చేయలేకపోతున్నామని, స్కూల్ కి వెళ్ళే విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. కాలుష్యానికి కారణమవుతున్న కంపెనీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించు కోవడం లేదని, ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కంపెనీ మేనేజర్ తో మాట్లాడి పది రోజులలో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.
