దుర్గమ్మ ఆలయ భూమిని కాపాడాలని గ్రామస్తుల రాస్తారోకో

దుర్గమ్మ ఆలయ భూమిని కాపాడాలని గ్రామస్తుల రాస్తారోకో

చిన్నశంకరంపేట, వెలుగు: చిన్నశంకరంపేట మండలం అంబాజీపేటలో దుర్గమ్మ ఆలయం వద్ద గ్రామకంఠం భూమిని కొందరు రియల్టర్లు కబ్జా చేశారని ఆరోపిస్తూ గ్రామస్తులు మంగళవారం చేగుంట-మెదక్ రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు. ఆలయం ముందు జేసీబీతో పనులు ప్రారంభించగా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడి ఆవరణలో ఉన్న 25 గుంటల భూమిని రియల్టర్లు కబ్జా చేసి చుట్టూ ప్రహరీ నిర్మాణం చేపట్టడంపై యువత అభ్యంతరం తెలిపారు. 

అమ్మవారు చూపు గ్రామంలో పడకుండా అడ్డుగోడలు పెడతారా అని ప్రశ్నించారు. ప్రధాన రహదారిపై వాహనాలు నిలిచిపోవడంతో విషయం తెలుసుకున్న డీఎస్పీ నరేందర్ గౌడ్, సీఐ వెంకట రాజా గౌడ్, ఎస్సై నారాయణ సంఘటనా స్థలానికి చేరుకొని గ్రామస్తులను సముదాయించారు. భూ రక్షణ కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రియల్ ఎస్టేట్ వ్యాపారిని పిలిపించి సమస్యను పరిష్కరిద్దామని డీఎస్పీ నరేందర్ గౌడ్ ప్రజలను శాంతింపచేశారు.