హైదరాబాద్: మహేష్ బాబు, కృష్ణ వంశీ కాంబోలో తెరకెక్కి సూపర్ హిట్ అయిన మురారి సినిమా చూసే ఉంటారు. ఈ సినిమా ఆరంభ సన్నివేశాల్లో ఒక ఆలయాన్ని హైలైట్ చేశారు. అదే అమ్మపల్లి శ్రీ సీతారాముల ఆలయం. కొన్నేళ్లుగా ఈ ఆలయం, ఆలయ పరిసరాలు, ఆలయ కొలను, ఆలయ ప్రాంగణం.. ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్లకు కేరాఫ్గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ఆలయం ఉన్నట్టుండి ఎందుకు వార్తల్లో నిలిచిందంటే.. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలోని నర్కుడ అమ్మపల్లి శ్రీ సీతారాముల ఆలయం దగ్గర గ్రామస్తులు ఆందోళనకు దిగారు.
ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రంగా ఉన్న ఆలయం దగ్గర ఫోటోషూట్లను షూటింగ్లను నిలిపివేయాలని గ్రామస్తులు ఆందోళన బాట పట్టారు. ఫోటోషూట్ల పేర్లతో అశ్లీలంగా ఫోటోలు దిగుతూ ఆలయాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని గ్రామ యువత ధర్నాకు దిగారు. ఆలయం దగ్గర డబ్బులు ఇస్తే గానీ అభిషేకాలు చేయడం లేదని.. హారతి పళ్లెంలో డబ్బులు పెడితే గానీ పంతులు పూజలు చేయడం లేదని గ్రామస్తులు మండిపడ్డారు. ఆలయానికి వచ్చే భక్తులకు సరైన సదుపాయాలు లేవని.. మంచినీటి సదుపాయాలు, టాయిలెట్ల దగ్గర ఐదు రూపాయలు.. పది రూపాయలు చొప్పున ఆలయ అధికారులు డబ్బులు వసూలు చేస్తున్నారని గ్రామస్తులు ఆందోళన చేశారు.
17వ శతాబ్దంలో నిర్మించిన ఆలయమే ఈ అమ్మపల్లి సీతా రామచంద్ర స్వామి ఆలయం. ఈ గుడిలో హనుమంతుడు ఉండడు. హనుమంతుడు రాముడ్ని కలవడానికి ముందే అరణ్యవాసంలో భాగంగా సీతారాములు ఇక్కడ అడుగుపెట్టారనీ.. అందుకే హనుమంతుడు లేకుండానే ఈ గుడిని కట్టారని చెప్తుంటారు. ఈ ఆలయాన్ని వేంగీని పాలించిన కల్యాణీ చాళుక్యులు కట్టించారు.
ఈ ఆలయ గర్భగుడిలోని సీతారామలక్ష్మణుల విగ్రహాలు ఏకశిల మీద చెక్కారు. వేల ఏండ్ల నాటి బావి , తొంభై అడుగుల గాలి గోపురాన్ని ఇక్కడ చూడొచ్చు. ఫొటో, సినిమా షూటింగ్స్‌కు ఈ గుడి ఎంతో ఫేమస్. ఇప్పుడు ఈ ఫొటోషూట్లే ఆలయ పవిత్రతను దెబ్బతీస్తున్నాయని గ్రామస్తులు ఆందోళనకు దిగడం గమనార్హం.
