రోడ్డు కోసం గ్రామస్థుల వినూత్న నిరసన

రోడ్డు కోసం గ్రామస్థుల వినూత్న నిరసన

మంచిర్యాల : అధికారులు తమ సమస్యను పట్టించుకోవడం లేదని ఓ గ్రామస్థులు వినూత్న నిరసనకు దిగారు. బురదమయంగా మారిన రోడ్డుపై నాట్లు వేసి ఆవేదనను తెలియజేశారు.  రోడ్లు వేయించమని సర్పంచ్ తో పాటు అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోకపోవడంతో గ్రామస్థులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

మంచిర్యాల జిల్లా భీమిని మండలంలోని పెద్ద గుడిపేట గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేదు. మట్టి రోడ్డు అది కూడా గుంతలమయంగా ఉండటంతో వర్షం పడ్డప్పుడల్లా బురదమయంగా మారుతోంది. గుంతల్లో నీళ్లు నిలబడి పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ గ్రామానికి రోడ్డు వేయమని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులెవరూగానీ ప్రజాప్రతినిధులుగానీ పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో విసుగుచెందిన జనం స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్లు పూర్తైనా, తెలంగాణ వచ్చి ఇన్నేళ్లైనా తమ గ్రామానికి కనీసం రోడ్డు సౌకర్యం కల్పించలేదంటూ రోడ్డుపై నాట్లు వేసి వినూత్నంగా నిరసన తెలిపారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చే నాయకులు ఆ తర్వాత తమను పట్టించుకోవడంలేదని గ్రామస్థులు వాపోయారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి తమ గ్రామానికి రోడ్డు వేయాలని కోరారు.