Vinesh Phogat: భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ మరోసారి వార్తల్లోకెక్కింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గొండాలో జరుగుతున్న జాతీయ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నమెంట్లో పాల్గొనకుండా ఆమెపై భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) అనర్హత వేటు వేయడం ఇప్పుడు క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ ఆంక్షలను లెక్కచేయకుండా పోటీలో పాల్గొనేందుకు ఆమె స్వయంగా గొండాకు చేరుకోవడంతో ఉత్కంఠకు దారి తీసింది. ఈ సందర్భంగా డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు సంజయ్ సింగ్‌తో సమావేశమైన అనంతరం వినేశ్ ఫోగట్ ఒక ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను కావాలనే టార్గెట్ చేసుకున్నారని ఆరోపించింది.
ఆసియా క్రీడలకు దూరం చేసే కుట్ర:
రాబోయే ఆసియా క్రీడల్లో తాను పాల్గొనకుండా అడ్డుకోవడమే డబ్ల్యూఎఫ్ఐ ప్రధాన లక్ష్యమని వినేశ్ ఫోగట్ విమర్శించింది. నేను మళ్లీ రింగ్‌లోకి దిగి పతకాలు గెలుస్తానని వారు భయపడుతున్నారు, అందుకే ఇన్ని అడ్డంకులు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. స్వయంగా తానే రిటైర్ కావాలని వారు కోరుకుంటున్నారని, అందుకే తనను మానసిక వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
నా కుమారుడే నా బలం:
2024 పారిస్ ఒలింపిక్స్‌లో ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ వినేశ్ ఫోగట్ భావోద్వేగానికి లోనయ్యారు. పారిస్ ఒలింపిక్స్‌లో అనర్హతకు గురైన తర్వాత నా జీవితంలోనే ఆనందాన్ని కోల్పోయాను.. కానీ నా కుమారుడు క్రిధవ్ తిరిగి నాలో కొత్త ఉత్సాహాన్ని నింపాడు.. వ్యవస్థపై పోరాడే శక్తి నా కొడుకు వల్లే వచ్చిందని ఆమె పేర్కొన్నారు.
నోటీసులపై క్లారిటీ:
తనపై వేసిన అనర్హత వేటుకు సంబంధించి శుక్రవారం రాత్రి నోటీసు అందిందని స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ తెలిపారు. సమాధానం ఇచ్చేందుకు 14 రోజుల గడువు ఉన్నప్పటికీ, సమయం లేకపోవడంతో క్లుప్తంగా వివరణ ఇచ్చానని చెప్పారు. తొలుత తనను పోటీకి అనుమతించాలని, 14 రోజుల తర్వాత తన వివరణతో సంతృప్తి చెందకపోతే చర్యలు తీసుకోవాలని సంజయ్ సింగ్‌ను కోరినట్లు వెల్లడించారు. కానీ ఇందుకు సమాఖ్య అధ్యక్షుడు అంగీకరించకపోవడం గమనార్హం.
మరోవైపు, రిటైర్మెంట్ ఉపసంహరణకు సంబంధించి ఉండాల్సిన 'ఆరు నెలల నోటీసు పీరియడ్' నిబంధనల ప్రకారమే వినేశ్‌పై చర్యలు తీసుకున్నట్లు రెజ్లింగ్ సమాఖ్య వర్గాలు వాదిస్తున్నాయి. వినేశ్ అండ్ డబ్ల్యూఎఫ్ఐ మధ్య జరుగుతున్న ఈ పోరాటం చివరకు ఎటు దారి తీస్తుందో చూడాలి.
