
మణిపూర్‌లోని బిష్ణుపూర్, చురచంద్‌పూర్ జిల్లాల మధ్య సరిహద్దు ప్రాంతాల్లో జరిగిన వేర్వేరు సంఘటనలలో గడిచిన 24 గంటల్లో పోలీసుతో సహా నలుగురు యువకులను ఆగంతకులు కాల్చివేశారు. వారి కాల్పుల్లో మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఆర్మీ వర్గాల సమాచారం ప్రకారం.. గత కొంత కాలంగా రాష్ట్రంలోని రెండు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకరిపై ఒకరు పరస్పర దాడులు చేసుకుంటున్నారు. దీంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతాలను 'బఫర్ జోన్' గా ప్రకటించాయి. ఇరు వర్గాలు పరస్పరం దాడి చేసుకున్నట్లు గ్రౌండ్ ఆపరేషన్‌లో పాల్గొన్న సీనియర్ భద్రతా అధికారి తెలిపారు. భద్రతా దళాలు ఆందోళన కారులను శాంతింపజేయడానికి ప్రయత్నిస్తున్నారు.
అయినప్పటికీ, భావోద్వేగాలు కొనసాగుతూనే ఉన్నాయి. పగటిపూట కూడా అడపాదడపా కాల్పులు కొనసాగాయని ఆర్మీ ఆఫీసర్లు చెప్పారు. ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్, చురచంద్‌పూర్, బిష్ణుపూర్, కక్చింగ్ జిల్లాల్లో దుండగులు, ఉగ్రవాదులు ఏర్పాటు చేసిన 18 అక్రమ బంకర్‌లను మణిపూర్ పోలీసులు కేంద్ర భద్రతా బలగాల సంయుక్త బృందం ధ్వంసం చేసింది. గడిచిన 24 గంటల్లో దాదాపు 50 అక్రమ బంకర్లను ధ్వంసం చేశారు. గత 24 గంటల్లో, ఇంఫాల్ తూర్పు జిల్లాలో ఐదు అధునాతన ఆయుధాలు, 74 రకాల మందుగుండు సామగ్రి, ఐదు అత్యంత పేలుడు హ్యాండ్ గ్రెనేడ్‌లు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో 126 చెక్పాయింట్లు ఏర్పాటు చేసి రక్షణ చర్యలు ఏర్పాటు చేశారు. చట్టాలు ఉల్లంఘించినందుకు 270 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.