హైదరాబాద్లో వైరల్ ఫీవర్స్ చూసి భయపడొద్దు

హైదరాబాద్లో వైరల్ ఫీవర్స్ చూసి భయపడొద్దు

హైదరాబాద్ ను సీజనల్ వ్యాధులు చుట్టుముట్టాయి. నగరంలో ఒక్కసారిగా వైరల్ ఫీవర్స్ పెరిగాయి. భాగ్యనగరంలోని ప్రభుత్వ దవాఖానాలో రోగుల సంఖ్య పెరుగుతోంది. గ్రేటర్ పరిధిలోని ఆసుపత్రులకు జ్వరాలతో ప్రజలు క్యూ కడుతున్నారు. హైదరాబాద్ లోని ఉస్మానియా, గాంధీ, ఫీవర్, నిమ్స్ ఆసుపత్రులకు రోగుల తాకిడి పెరిగింది. 

వైరల్‌ ఫీవర్‌ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నందున రోగులు అప్రమత్తంగా ఉండాలని.. అయితే భయాందోళనలకు లోనుకావద్దని నగరంలోని ప్రముఖ పిల్లల డాక్టర్‌ ఆయేషా సూచించారు. ఈ సీజన్‌లో వైరల్ ఫీవర్ వ్యాప్తి చెందడం సర్వ సాధారణమని చెప్పారు. కొత్త వైరస్‌లు ఏవీ పుట్టుకొచ్చే సూచనలు లేవన్నారు. 

ప్రస్తుతం చాలా మంది రోగులు గొంతు, ముక్కు పరీక్షలు చేయించుకుంటున్నారు. కరోనా సోకిందన్న భయంతోనూ పరీక్షలు చేయించుకుంటున్నారు. యాంటీవైరల్, ఫ్లూ, ఇన్ఫెక్షియస్ వైరస్‌లకు సంబంధించిన మెడిసిన్స్  అందుబాటులో ఉన్నాయంటున్నారు. అనవసరమైన ఆందోళన వద్దని, భయపడాల్సిన అవసరం లేదంటున్నారు డాక్టర్ అయేషా.

Also Read :- ఆ మూడు రోజులు ఢిల్లీ మొత్తం బంద్ : స్కూల్స్, కాలేజీలు, ఆఫీసులు అన్నీ..

చిన్న పిల్లలు జ్వరం, వాంతులు, విరేచనాలు, దగ్గు, జలుబు లేదా గొంతు నొప్పి వంటి లక్షణాలతో బాధపడుతుంటే మాత్రం తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ అయేషా సూచించారు. ముఖ్యంగా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, డెంగ్యూ వంటి వ్యాధులు రాకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

చిన్నపిల్లలు లేదా పెద్ద వాళ్లకు అయినా రెండు నుంచి మూడు రోజులుగా జ్వరం తగ్గకపోతే మాత్రం తప్పనిసరిగా దగ్గరలోని డాక్టర్ ను సంప్రదించాలని సూచిస్తున్నారు. డెంగ్యూ కేసుల తీవ్రత ప్రస్తుతం చెప్పుకోదగ్గ స్థాయిలో లేదన్నారు. అయినా.. డెంగ్యూ నివారణ లక్ష్యంగా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.