వైరల్ వీడియో: రన్నింగ్ ట్రైన్ ఎక్కుతూ కింద పడిన మహిళ

వైరల్ వీడియో: రన్నింగ్ ట్రైన్ ఎక్కుతూ కింద పడిన మహిళ

ఓ మహిళ రన్నింగ్ ట్రైన్ ఎక్కబోతూ బ్యాలెన్స్ తప్పి.. జారి కిందపడింది. ఏ మాత్రం కాస్త తేడా అయినా ఆమె ప్లాట్ ఫామ్ కు, ట్రైన్ కు మధ్య చిక్కుకుని తీవ్రంగా గాయపడేది. కానీ క్షణాల వ్యవధిలో ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ ఒకరు.. ఆ ప్యాసింజర్ పట్టుతప్పడం గమనించి దబ్బున ఉరికి కాపాడారు. ముంబైలోని బైకులా రైల్వేస్టేషన్ లో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియోను సెంట్రల్ రైల్వే ట్విట్టర్ హ్యాండిల్ లో అధికారులు పోస్ట్ చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లంతా ఆ మహిళా కానిస్టేబుల్ ను సూపర్ అంటూ మెచ్చుకుంటున్నారు. ‘వేగంగా స్పందించారు, దేవుడు మిమ్మల్ని మంచిగా చూడాలి’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. 

రెండు నెలల్లో రెండోసారి..

40 ఏండ్ల మహిళ ఒకామె ముంబైలోని బైకులా రైల్వే స్టేషన్ లో ఆదివారం రాత్రి రన్నింగ్ లో ఉన్న లోకల్ ట్రైన్ ఎక్కుతుండగా స్లిప్ అయ్యి పడింది. అయితే ఆమెను ట్రైన్ కాస్త ముందుకు ఈడ్చుకుంటూ పోవడాన్ని అక్కడే ఉన్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) కానిస్టేబుల్ సప్నా గోల్కర్.. చూసి క్షణాల్లో రెస్పాండ్ అయ్యారు. ఆమె ఆ బాధిత మహిళలను పక్కకు లాగి కాపాడారు.  ఆ మహిళా కానిస్టేబుల్ కు స్టేషన్ లో ఉన్న మిగతా వాళ్లు కూడా సాయంగా వచ్చారు. కాగా ఇలా గడిచిన రెండు నెలల్లో ఇలా రన్నింగ్ ట్రైన్ నుంచి జారిపడిన వాళ్లను కాపాడడం ఇది రెండోసారి.