దేవుడి విగ్రహం విరగ్గొట్టాడని.. వృద్ధుడిని కొట్టారు

దేవుడి విగ్రహం విరగ్గొట్టాడని.. వృద్ధుడిని కొట్టారు

భోపాల్: దేవుడి విగ్రహం విరగ్గొట్టాడని ఓ వృద్ధుడిని కొంత మంది యువకులు నడి రోడ్డుపై ఈడ్చుకుంటూ కొట్టారు. మధ్యప్రదేశ్‌లోని నీమచ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. 
శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో నీమచ్‌లో మూల్‌చంద్ మార్గ్‌ ఏరియాలో ఉన్నట్టుండి కొందరు యువకులు ఉన్నట్టుండి ఓ వృద్ధుడిని  చుట్టుముట్టారు. దేవుడి విగ్రహాన్ని విరగ్గొడతావా అంటూ అతడిని జుట్టు పట్టి ఈడుస్తూ కర్రతో కొట్టారు. ఆ సమయంలో అక్కడున్న వాళ్లు దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయింది. అయితే ఆ వృద్ధుడిని కొడుతున్నప్పుడు చుట్టూ చాలా మంది ఉన్నా ఎవరూ ఆపే ప్రయత్నం చేయలేదు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని నీమచ్ సీఎస్పీ రాకేశ్ మోహన్ శుక్లా తెలిపారు. ఆ వీడియోలో ఉన్న వృద్ధుడిని కమల్ దాస్‌గా గుర్తించినట్టు చెప్పారు. అతడు చాలా ఏండ్లుగా నీమచ్‌లోని శ్మశానంలో నివసిస్తున్నాడని, అతడి మానసిక స్థితి సరిగా లేదని తేలిందన్నారు. అతడిపై దాడికి పాల్పడిన వారిని గుర్తించి అరెస్ట్ చేస్తామని అన్నారు. అయితే నీమచ్‌లో దేవుడి విగ్రహం విరిగిందంటూ ఎక్కడా కంప్లైంట్ నమోదు కాలేదన్నారు.