వైరల్: అపార్టుమెంటులో ఎగ బాకిన విషసర్పం 

వైరల్: అపార్టుమెంటులో ఎగ బాకిన విషసర్పం 
  • వైరల్ అవుతున్న వీడియో 
  • తమ నివాసాలు ధ్వంసం చేసి అపార్టుమెంట్లు కట్టినా.. ఆ ప్రాంతంలోనే తిరుగుతున్న పాములు

విజయవాడ: ఆకాశ హర్మ్యాలలో నివసిస్తున్నాం... పాములు, పుట్రలు ఇక్కడికి రావడం అసాధ్యం.. అలాంటి ఆపదలు మా దరి చేరవు అని  ధీమాగా ఉండే రోజులు పోయాయి. అరణ్యంలో చిరుతలు చెట్టిక్కినట్లు  నల్ల త్రాచులు నాలుగైదు అంతస్థుల పైకి ఎంతో సులువుగా చేరుకొని బుసలు కొడుతూ మహిళలను పిల్లలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. 
నీటి పైపు లైన్లు, టాయిలెట్  గొట్టాలపై  ఎంతో నేర్పుగా ఎగబాకుతూ డబుల్ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లలో సంచారం చేస్తున్నాయి. గాలి వెలుతురు కోసం తెరిచిన కిటికీల ద్వారా జర్రున  చోరబడుతున్నాయి. ఇంట్లో అలికిడి లేకుండా ఉంటే అక్కడే మత్తుగా తిష్ట వేసి ప్రశాంతంగా సేద తీరుతున్నాయి.  
ఇంట్లో చిన్నపాము కనిపిస్తేనే ఎంతో భయమేస్తుంది ఎవరికైనా అలాంటిది  భారీ సర్పం బాత్రూమ్ లో  కనిపిస్తే.. ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. పెద్ద స్థలం కనబడితే , వీలైనంత చవకగా కొని అయిదారు అంతస్తుల అపార్ట్మెంట్ నిర్మించి , ఒక్క ఫ్లాట్ ముప్పై నలభై లక్షలకు అమ్మడం కృష్ణా జిల్లా మచిలీపట్నం పరిసరాల్లో పరిపాటిగా మారిందన్న విమర్శలు ఉన్నాయి. 
పురాతనమైన ఇళ్లను కూల్చి పెద్ద చెట్లను పెకలించి పాముల పుట్టలను ప్రొక్లైన్లతో అణగదొక్కి అదే స్థానంలో భారీ అంతస్తులు జోరుగా నిర్మిస్తున్నారు. దశాబ్దాలుగా జనసంచారం లేని ప్రదేశాలలో అజ్ఞాతంగా నివసించే తమ స్థావరాలను పాడుచేసి.. నిలువనీడ లేకుండా చేసిన కొందరు బిల్డర్ల పై పాములు పగతో రగిలిపోతున్నట్లు అందుకేనేమో తరచూ కొన్ని అపార్టుమెంట్లోనికి పలుమార్లు వస్తున్నాయేమోనని స్థానికులు బెంబేలెత్తుతున్నారు. 
రెండు మూడు రోజుల క్రితం టాయిలెట్ కమాడ్ పక్కన ఉన్న సింక్‌హోల్‌ చుట్టూ ఆరడుగులు పైబడిన పొడవుతో నల్లగా నిగ నిగలాడే  త్రాచు పాము చుట్టుకొని ఉండటం చూసి ఒక మహిళ నిర్ఘాంతపోయింది. అయితే ,  ఆ పాము నీవు కాదు నా లక్ష్యం అన్నట్లు మెల్లిగా అక్కడి నుంచి నిష్క్రమించి  మరో ఫ్లాట్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించిందట  వెంటనే ఆమె తేరుకొని బతుకు జీవుడా అంటూ  వెలుపలకు పరుగెత్తుకు వచ్చిందన్న విషయం స్థానికులకు తెలిసిందే. ముచ్చటగా కొనుక్కున్న ఫ్లాట్ ను వేరే ఎవరికైన అద్దెకి ఇచ్చి వేరే ప్రాంతంలో మనమూ బాడుగకు ఉందామని ఆమె తన భర్తను సతాయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.