
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు.. విరాట్ కోహ్లీకి ఉన్న అనుబంధం ఎంతో ప్రత్యేకం. ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి బెంగళూరు జట్టుకు ఆడుతున్న కోహ్లీ ఇప్పటికీ అదే జట్టుతో కొనసాగుతున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఒకే జట్టుకు కొనసాగడం కోహికి మాత్రమే సాధ్యమైంది. జట్టు ఓటముల్లో ఉన్నప్పటికీ.. బలహీనంగా ఉన్న సమయంలో తన జట్టును వదల్లేదు. ఈ క్రమంలో ఎన్నో విమర్శలు.. ఎన్నో ట్రోల్స్ వచ్చినప్పటికీ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ట్రోఫీ కొట్టాలని ప్రతి సీజన్ లో పోరాడుతూనే వచ్చాడు. 17 సీజన్ లలో మూడు సార్లు ఫైనల్ కు వచ్చినా ట్రోఫీ దగ్గరకు వచ్చి ఓడింది.
ఎట్టకేలకు 18 ప్రయత్నంలో కోహ్లీ తన ఐపీఎల్ కప్ కలను నెరవేర్చుకున్నారు. మంగళవారం (జూన్ 3) నరేంద్ర మోడీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ పై గెలిచి తొలిసారి ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకుంది. ఎప్పటిలాగే ఐపీఎల్ 2025 సీజన్ లో జట్టును ముందుండి నడిపించగా.. మిగతా ఆటగాళ్లందరూ సమిష్టిగా రాణించడంతో తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. 4 బంతుల్లో 29 పరుగులు చేయాల్సిన దశలో కోహ్లీ ఎమోషనల్ మూమెంట్ ఎప్పటికీ మర్చిపోలేనిది. ఇక ఆర్సీబీ విజయం ఖరారైన తర్వాత కోహ్లీ మోకాళ్లపై గ్రౌండ్ లో కన్నీళ్లు పెట్టుకున్న క్షణం ప్రతి ఒక్కరి మనసుని హత్తుకుంది. కెప్టెన్ రజత్ పటిదార్ ఐపీఎల్ ట్రోఫీ గెలవగానే సెలెబ్రేట్ చేసుకొని కోహ్లీ చేతికి ట్రోఫీ అందించాడు.
మ్యాచ్ తర్వాత కోహ్లీ ఆర్సీబీ జట్టుపై ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. " నా యవ్వనాన్ని, నా ప్రాధాన్యతను, నా అనుభవాన్ని ఆర్సీబీ జట్టుకు ఇచ్చాను. గత 18 సీజన్ లుగా నేను జట్టుకు అన్నీ ఇచ్చాను. బెంగళూరు జట్టుకు విధేయుడిగా ఉన్నాను. ఏది ఏమైనా.. నేను వారితో (అభిమానులు, జట్టుతో) నిలబడ్డాను. వారు నా వెనుక నిలిచారు. జట్టుతో కలిసి ట్రోఫీ అందుకోవాలని కన్న కల నిజమైంది. ఈ టైటిల్ నాకు అన్ని టైటిల్స్ కంటే ముఖ్యం". అని చెప్పుకొచ్చాడు. పంజాబ్ తో జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్ లో కోహ్లీ 35 బంతుల్లో 43 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. మంగళవారం (జూన్ 3) అహ్మదాబాద్ వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన ఫైనల్లో 6 పరుగుల తేడాతో విజయం సాధించి తొలిసారి ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది. 17 ఏళ్లుగా ఎదురు చూసిన ట్రోఫీ 18వ ప్రయత్నంలో సాధించి తమ కప్ కళను నెరవేర్చుకున్నారు. మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో పంజాబ్ కింగ్స్ 7 వికెట్లకు 184 పరుగులకు పరిమితమైంది.