దక్షిణాఫ్రికా సిరీస్‌కు కోహ్లీ దూరం.. మరి రోహిత్ పరిస్థితి ఏంటి..?

దక్షిణాఫ్రికా సిరీస్‌కు కోహ్లీ దూరం.. మరి రోహిత్ పరిస్థితి ఏంటి..?

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పరిమిత ఓవర్ల క్రికెట్ మీద ఆసక్తి చూపించడం లేదని స్పష్టంగా తెలుస్తుంది. ఆసియా కప్, వరల్డ్ కప్ మినహాయిస్తే కోహ్లీ గత రెండేళ్లలో ఆడిన వన్డేలు వేళ్ళ మీద లెక్కపెట్టుకోవాల్సిందే. ఇక టీ20 క్రికెట్ ఆడక ఏడాది దాటిపోయింది. ఈ నేపథ్యంలో టెస్టుల మీదే దృష్టి పెడుతున్న విరాట్ ..దక్షిణాఫ్రికాతో జరగబోయే పరిమిత ఓవర్ల క్రికెట్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. తాజాగా బీసీసీఐని కలిసిన కోహ్లీ దక్షిణాఫ్రికాతో జరగబోయే వన్డే, టీ 20 సిరీస్ కు దూరంగా ఉండాలని చెప్పాడంట. 

పరిమిత ఓవర్ల క్రికెట్ కు దూరంగా ఉన్నప్పటికీ టెస్టు సిరీస్ కు అందుబాటులో ఉంటానని కోహ్లీ తెలిపినట్టు రిపోర్ట్స్ చెబుతున్నాయి. గత మూడు నెలలుగా కోహ్లీ బిజీ క్రికెట్ ఆడుతున్నాడు. ఈ మేరకు రెస్ట్ తీసుకోవాలని భావించాడట. టీమిండియా ప్రస్తుతం స్వదేశంలో ఆస్ట్రేలియాతో 5 టీ20ల సిరీస్ ఆడుతోంది. డిసెంబర్ 3తో ఈ సిరీస్ పూర్తవుతుంది. ఇక ఈ సిరీస్ తర్వాత డిసెంబర్ 10-21 వరకు  దక్షిణాఫ్రికాతో మూడు వన్డేలు, మూడు టీ20 లు ఆడాల్సి ఉంది.   

డిసెంబర్ 26 నుంచి రెండు టెస్టుల సిరీస్ ప్రారంభమవుతుంది. వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి తర్వాత లండన్ కు వెళ్లిన కోహ్లీ ఇంకా స్వదేశానికి తిరిగి రాలేదు. మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడతాడా లేదా తెలియాల్సి ఉంది. ఇటీవలే టీ 20లపై రోహిత్ ఆసక్తి లేదని చెప్పడంతో ఈ సిరీస్ కు హిట్ మ్యాన్ ఆడేది లేనిదీ సస్పెన్స్ గా మారింది.  ఒకవేళ రోహిత్ కు కూడా రెస్ట్ ఇస్తే రాహుల్ కు భారత కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిచవచ్చు.  ప్రస్తుతం రోహిత్ యునైటెడ్ కింగ్ డంలో ఉన్నాడు.