రోహిత్తో ఎలాంటి విభేదాల్లేవ్

రోహిత్తో ఎలాంటి విభేదాల్లేవ్

ముంబై: వన్డే కెప్టెన్సీ విషయంలో రోహిత్ కు, తనకు మధ్య విభేదాలు వచ్చాయంటూ వస్తున్న వార్తలపై విరాట్ కోహ్లీ స్పందించాడు. రోహిత్ తో తనకు ఎలాంటి సమస్య లేదని కోహ్లీ క్లారిటీ ఇచ్చాడు. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ సెలెక్షన్ కు తాను అందుబాటులో ఉన్నానని స్పష్టం చేశాడు. వన్డే సారథ్య పగ్గాల నుంచి తనను తప్పిస్తున్నట్లు చీఫ్ సెలెక్టర్ చెప్పారన్నాడు. ‘సెలెక్షన్ మీటింగ్ కు కేవలం గంటన్నర ముందు నన్ను సంప్రదించి, టెస్టు టీమ్ గురించి చర్చించారు. వన్డే కెప్టెన్సీ నుంచి నన్ను తొలగిస్తున్నట్లు చెప్పారు’ అని విరాట్ అన్నాడు. 

‘బయట ఎన్నో విషయాలు జరుగుతున్నాయి. అవన్నీ నా చేతుల్లో లేనివి. అందుకే జట్టు కోసం వ్యక్తిగతంగా నేనేం చేయగలనో దాని మీదే దృష్టి పెడుతున్నా. సౌతాఫ్రికా సిరీస్ కు వెళ్లడానికి మానసికంగా సంసిద్ధంగా ఉన్నా. చాలా ఫోకస్ తో ఉన్నా. ఈ సిరీస్ లో ఎప్పుడెప్పుడు ఆడదామా అని ఆతృతతో ఉన్నా. టీమ్ ను గెలిపించేందుకు సర్వశక్తులు ఒడ్డటానికి రెడీ. జట్టుకు కెప్టెన్ గా ఉండటం ఎంతో గర్వకారణం. సారథిగా ఏం చేయగలనో అది చేశా. కెప్టెన్ గా ఉండకపోవడం నా బ్యాటింగ్ పై ప్రభావం చూపుతుందని అనుకోను. సారథిగా ఉన్నా లేకపోయినా ఒకే మానసిక స్థితితో గ్రౌండులోకి దిగుతా. జట్టులో మన పాత్ర ఏంటి, పరిస్థితులు ఏంటనేది అర్థం చేసుకోవాలి’ అని కోహ్లీ పేర్కొన్నాడు. టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకునేందుకు ముందు బీసీసీఐని సంప్రదించానని.. తాను ఎందుకు తప్పుకోవాలని అనుకుంటున్నానో వివరించానని అన్నాడు. దీనికి బోర్డు సరైన రీతిలో స్పందించిందన్నాడు. కెప్టెన్సీ వదలొద్దని అనలేదు కానీ ఇది ప్రోగ్రెసివ్ స్టెప్ అని బీసీసీఐ చెప్పిందని వ్యాఖ్యానించాడు.  

మరిన్ని వార్తల కోసం: 

జవాన్ సోదరి పెళ్లి.. అన్న లేని లోటు తీర్చిన ఆర్మీ

శిల్పా చౌదరికి 14 రోజుల రిమాండ్