జవాన్ సోదరి పెళ్లి.. అన్న లేని లోటు తీర్చిన ఆర్మీ

జవాన్ సోదరి పెళ్లి.. అన్న లేని లోటు తీర్చిన ఆర్మీ

రాయ్‌బరేలీ: సరిహద్దుల్లో పహారా కాసే జవాన్లు తమ కుటంబాల కంటే దేశ రక్షణే ముఖ్యంగా భావిస్తారు. దేశమే కుటుంబంగా అనుకుని బాధ్యతలు నిర్వర్తిస్తుంటారు. ఈ క్రమంలో ఎందరో జవాన్లు మన కోసం ప్రాణత్యాగాలు కూడా చేస్తుంటారు. అలా అమరులైన సైనికుల కుటుంబాల బాధ మాటల్లో చెప్పడం కష్టమే. బిడ్డను కోల్పోయిన అమ్మానాన్నలు, అన్నను కోల్పోయిన చెల్లెళ్లు ఎందరో. అలాంటి వాళ్లకు ఆర్మీ అండగా నిలిస్తే! వారి ఇంట్లో వేడుకకు తోటి జవాన్లు తరలివస్తే ఎలా ఉంటుందో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో చూశాం. అలాంటి సీనే ఉత్తర్ ప్రదేశ్ లోని రాయ్ బరేలీలో రిపీట్ అయ్యింది. అమరుడైన సహోద్యోగి కానిస్టేబుల్ శైలేంద్ర ప్రతాప్ సింగ్ చెల్లి పెళ్లికి మిగిలిన జవాన్లు అటెండ్ అవ్వడమే గాక.. పెళ్లి పనులు దగ్గరుండి చూసుకున్నారు. ఈ వేడుక డిసెంబర్ 13న అంగరంగవైభవంగా జరిపించారు. 

అమరుడైన జవాన్ శైలేంద్ర ప్రతాప్ సింగ్‌ సోదరి జ్యోతి వివాహానికి సహచర సీఆర్‌పీఎఫ్‌  సైనికులు హాజరయ్యారు. దీంతో వేడుకలో అందరూ కాస్త ఎమోషనల్ అయ్యారు. వధువు కూడా భావోద్వేగానికి గురైంది. శైలేంద్ర తండ్రి కూడా భావోద్వేగానికి లోనయ్యారు. ‘నా కొడుకు ఈ లోకంలో లేడు. కానీ ఇప్పుడు చాలా మంది కుమారులు జవాన్ల రూపంలో ఈ వేడుకకు వచ్చారు. వారు ఎప్పుడూ మా సుఖ, దుఃఖాల్లో అండగా ఉన్నారు’ అని ఆయన చెప్పుకొచ్చాడు. కాగా, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కానిస్టేబుల్ శైలేంద్ర ప్రతాప్ సింగ్ 2020 అక్టోబర్‌లో కశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో మరణించాడు.

మరిన్ని వార్తల కోసం: 

ప్రస్తుత పరిస్థితుల్లో టీకాలు పని చేస్తాయని చెప్పలేం

ప్రాణాలతో బయటపడిన ఆ ఒక్కడు కూడా మృతి