కోహ్లీ = సచిన్.. మాస్టర్ రికార్డు సమం చేసిన విరాట్

కోహ్లీ = సచిన్.. మాస్టర్ రికార్డు సమం చేసిన విరాట్

క్రికెట్ సూపర్‌‌‌‌‌‌‌‌ స్టార్ విరాట్ కోహ్లీ  తన బర్త్‌‌‌‌డే నాడు ఫ్యాన్స్‌‌‌‌కు పర్‌‌‌‌‌‌‌‌ఫెక్ట్ గిఫ్ట్ ఇచ్చాడు. 35వ పుట్టిన రోజున వన్డేల్లో 49వ సెంచరీ కొట్టి లెజెండరీ క్రికెటర్ సచిన్‌‌‌‌ టెండూల్కర్ అత్యధిక సెంచరీల రికార్డును సమం చేశాడు. ధర్మశాలలో న్యూజిలాండ్ పై, ముంబైలో శ్రీలంకపై వంద చేజార్చుకున్నా  ప్రఖ్యాత ఈడెన్‌‌‌‌ గార్డెన్స్‌‌‌‌లో కిక్కిరిసిన ప్రేక్షకులకు మాత్రం సూపర్  ట్రీట్‌‌‌‌ ఇచ్చాడు.

కష్టమైన పిచ్‌‌‌‌పై క్లాసిక్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌తో అలరించిన విరాట్ ప్రతీ పరుగు కోసం ప్రాణం పెట్టి ఆడి రికార్డు ‘వంద’ అందుకున్నాడు. అతని జోరుతో భారీ స్కోరు చేసిన టీమిండియా బౌలింగ్‌‌‌‌లో రవీంద్ర జడేజా మ్యాజిక్‌‌‌‌ చూపెట్టడంతో వరుస విజయాలతో దూసుకొస్తున్న  సౌతాఫ్రికాకు వన్డేల్లో అతి పెద్ద ఓటమిని రుచి చూపెట్టింది. వన్డే వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో వరుసగా ఎనిమిదో విక్టరీ కొట్టిన రోహిత్‌‌సేన పాయింట్స్‌ టేబుల్లో టాప్ ప్లేస్‌‌ సొంతం చేసుకొని సెమీఫైనల్​కు వెళ్లనుంది. 
 
కోల్‌‌‌‌కతా: బర్త్‌‌‌‌డే బాయ్‌‌‌‌ విరాట్‌‌‌‌ కోహ్లీ (121 బాల్స్‌‌‌‌లో 10 ఫోర్లతో 101 నాటౌట్​) హిస్టారిక్‌‌‌‌ సెంచరీకి తోడు బౌలర్ల జోరుతో వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌లో టీమిండియా 8వ మ్యాచ్‌‌లో గెలిచింది. ఈడెన్‌‌‌‌ గార్డెన్స్‌‌‌‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌‌‌‌లో 243 రన్స్‌‌‌‌ తేడాతో సౌతాఫ్రికాపై ఘన విజయం సాధించింది. ఈ వన్‌‌‌‌సైడ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో తొలుత ఇండియా 50 ఓవర్లలో 326/5 స్కోరు చేసింది.

కోహ్లీకి తోడు శ్రేయస్ అయ్యర్ (87 బాల్స్‌‌‌‌లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 77), రోహిత్‌‌‌‌ శర్మ (24 బాల్స్‌‌‌‌లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 40) సత్తా చాటారు. అనంతరం ఛేజింగ్‌‌‌‌లో జడేజా (5/33) దెబ్బకు సౌతాఫ్రికా 27.1 ఓవర్లలో 83 రన్స్‌‌‌‌కే ఆలౌటై ఓడింది.  మార్కో జాన్సెన్‌‌‌‌ (14) టాప్‌‌‌‌ స్కోరర్. జడేజాతో పాటు షమీ, కుల్దీప్‌‌‌‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. కోహ్లీకి ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్ ద మ్యాచ్‌‌‌‌ అవార్డు లభించింది. ఇండియా తన చివరి లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ను ఈ నెల 11న బెంగళూరులో నెదర్లాండ్స్‌‌‌‌తో ఆడనుంది.

క్లాసిక్‌‌‌‌  కోహ్లీ 

తొలుత బ్యాటింగ్‌‌‌‌కు, సమయం గడుస్తున్న కొద్దీ బౌలర్లకు అనుకూలించిన పిచ్‌‌‌‌పై టీమిండియా సత్తా చాటింది. స్టార్టింగ్‌‌‌‌లో రోహిత్‌‌‌‌ ఇచ్చిన మెరుపు ఆరంభాన్ని సద్వినియోగం చేసుకుంటూ శ్రేయస్‌‌‌‌ అయ్యర్‌‌‌‌‌‌‌‌తో ఇన్నింగ్స్‌‌‌‌ను నడిపించిన కోహ్లీ క్లాసిక్ బ్యాటింగ్‌‌‌‌తో జట్టుకు మంచి స్కోరు అందించాడు. కెప్టెన్ రోహిత్ ఉన్నంతసేపు దంచికొట్టాడు.

సఫారీ పేసర్లు ఎంగిడి (1/63),  జాన్సెన్‌‌‌‌ (1/94) బౌలింగ్‌‌‌‌లో వరుస బౌండ్రీలతో రెచ్చిపోయాడు. ఎంగిడి వేసిన ఐదో ఓవర్లో 4, 6, 6తో స్టేడియాన్ని హోరెత్తించాడు. కానీ, రబాడ వేసిన తర్వాతి ఓవర్లో సఫారీ కెప్టెన్‌‌‌‌ బవూమ పట్టిన అద్భుత క్యాచ్‌‌‌‌కు వెనుదిరగడంతో తొలి వికెట్‌‌‌‌కు 62 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌ ముగిసింది. అప్పటికే క్రీజులో కుదురుకున్న గిల్‌‌‌‌  (23) జాన్సెన్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌లో భారీ సిక్స్‌‌‌‌తో జోరు పెంచాడు. కోహ్లీ కూడా వెంటవెంటనే మూడు ఫోర్లు కొట్టడంతో పవర్‌‌‌‌‌‌‌‌ప్లేలో ఇండియా 91/1తో నిలిచింది. అయితే, 11వ ఓవర్లో బౌలింగ్‌‌‌‌కు దిగిన స్పిన్నర్ కేశవ్‌‌‌‌ మహారాజ్‌‌‌‌ (1/30) అద్భుతమైన డ్రిఫ్ట్‌‌‌‌తో గిల్‌‌‌‌ను బౌల్డ్‌‌‌‌ చేశాడు.

వరుసగా పది ఓవర్ల స్పెల్‌‌ వేసిన కేశవ్‌‌‌‌ పొదుపుగా బౌలింగ్‌‌‌‌ చేయగా.. కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ జాగ్రత్తగా ఆడారు. మరో ఎండ్‌‌‌‌లో  రబాడ (1/48), ఎంగిడి, షంసి (1/42) కూడా కట్టడి చేయడంతో  11 నుంచి 27 ఓవర్లలో  62 రన్సే వచ్చాయి. కానీ, తర్వాతి ఓవర్లోనే షంసి బౌలింగ్‌‌‌‌లో స్ట్రెయిట్‌‌‌‌ సిక్స్‌‌‌‌ కొట్టిన శ్రేయస్ జోరు పెంచాడు. మార్‌‌‌‌‌‌‌‌క్రమ్‌‌‌‌ (0/17) బౌలింగ్‌‌‌‌లో కోహ్లీ ఫోర్‌‌‌‌‌‌‌‌, అయ్యర్‌‌‌‌‌‌‌‌ సిక్స్‌‌‌‌ బాదడంతో  34 ఓవర్లకు స్కోరు 200 దాటింది. కోహ్లీని దాటి ముందుగానే సెంచరీ చేసేలా కనిపించిన అయ్యర్‌‌‌‌‌‌‌‌.. ఎంగిడి ఆఫ్​ కట్టర్‌‌‌‌‌‌‌‌కు మార్‌‌‌‌‌‌‌‌క్రమ్‌‌‌‌కు క్యాచ్‌‌‌‌ ఇవ్వడంతో మూడో వికెట్‌‌‌‌కు134 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌ ముగిసింది.

కేఎల్‌‌‌‌ రాహుల్ (8) ఫెయిలవగా, వెంటవెంటనే ఐదు ఫోర్లతో అలరించిన సూర్యకుమార్ (22)ను షంసి వెనక్కుపంపాడు. అప్పటికి 90లోకి వచ్చిన విరాట్.. రబాడ వేసిన 47వ ఓవర్లో డీప్‌‌‌‌ కవర్‌‌‌‌‌‌‌‌ మీదుగా ఫోర్  కొట్టి 97కు చేరుకున్నాడు. రబాడ తర్వాతి ఓవర్  మూడో బాల్‌‌‌‌ను కవర్స్ మీదుగా పంపి సింగిల్‌‌‌‌ తీసిన కోహ్లీ 49వ సెంచరీ (119 బాల్స్‌‌‌‌) పూర్తి చేసుకున్నాడు. ఆఖరి ఓవర్లో జడేజా (29 నాటౌట్‌‌‌‌) సిక్స్‌‌‌‌, రెండు ఫోర్లు సహా 17 రన్స్ రాబట్టి ఫినిషింగ్‌‌‌‌ టచ్‌‌‌‌ ఇచ్చాడు. 

సఫారీలు ఢమాల్

టోర్నీలో భారీ స్కోర్లతో చెలరేగిపోతున్నా ఛేజింగ్‌‌‌‌లో తడబడుతున్న సౌతాఫ్రికా ఈడెన్‌‌‌‌లో ఇండియా బౌలింగ్‌‌‌‌ దెబ్బకు కుదులైంది. భారీ లక్ష్య ఛేదనలో ఏ దశలోనూ హోమ్‌‌‌‌టీమ్‌‌‌‌కు కనీస పోటీ ఇవ్వలేకపోతుంది. నాలుగు సెంచరీలతో జోరు మీదున్న టోర్నీ టాప్‌‌‌‌ స్కోరర్ డికాక్‌‌‌‌ (5)ను ఇన్నింగ్స్‌‌‌‌ పదో బాల్‌‌‌‌కే బౌల్డ్ చేసిన హైదరాబాదీ సిరాజ్‌‌‌‌ (1/11) ఆ టీమ్ పతనాన్ని ఆరంభించాడు. ఆ తర్వాత జడేజా తన స్పిన్‌‌‌‌ మ్యాజిక్‌‌‌‌తో సౌతాఫ్రికాను దెబ్బ మీద దెబ్బ కొట్టాడు. తొమ్మిదో ఓవర్లో బౌలింగ్‌‌‌‌కు వచ్చి  తన మూడో బాల్‌‌‌‌కే కెప్టెన్ బవూమ (11)ను క్లీన్‌‌‌‌బౌల్డ్ చేశాడు.

సూపర్‌‌‌‌‌‌‌‌ ఫామ్‌‌‌‌లో ఉన్న పేసర్ షమీ (2/18) తర్వాతి ఓవర్లోనే మార్‌‌‌‌‌‌‌‌క్రమ్ (9) ఎడ్జ్‌‌‌‌ రాబట్టాడు. ఆ వెంటనే హార్డ్‌‌‌‌ హిట్టర్‌‌‌‌‌‌‌‌ క్లాసెన్‌‌‌‌ (1)ను జడ్డూ ఎల్బీ చేయగా.. రెండు బాల్స్‌‌‌‌ తర్వాత డసెన్‌‌‌‌ (13)ను కూడా షమీ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఈ రెండు సందర్భాల్లో అంపైర్‌‌‌‌‌‌‌‌ నాటౌట్‌‌‌‌ ఇవ్వగా.. రివ్యూలో ఇండియా వికెట్లు సాధించింది. దాంతో సఫారీ టీమ్ 40/5తో పీకల్లోతు కష్టాల్లో పడింది.  లోయర్‌‌‌‌‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌ బ్యాటర్లు కూడా ఆ టీమ్‌‌‌‌ను ఆదుకోలేకపోయారు. జడ్డూ టర్నింగ్‌‌‌‌ను అర్థం చేసుకోలేక పెవిలియన్‌‌‌‌కు క్యూ కట్టారు. అతని బౌలింగ్‌‌‌‌లో మిల్లర్ (11), కేశవ్‌‌‌‌ (7) క్లీన్‌‌‌‌ బౌల్డ్‌‌‌‌ అయ్యారు. కాసేపు ప్రతిఘటించిన జాన్సెన్‌‌‌‌ను కుల్దీప్‌‌‌‌ (2/7) ఓ గూగ్లీతో బోల్తా కొట్టించగా.. రబాడ (6)ను రిటర్న్‌‌‌‌ క్యాచ్‌‌‌‌తో పెవిలియన్‌‌‌‌ చేర్చిన జడ్డూ ఐదు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఎంగిడి (0)ని బౌల్డ్‌‌‌‌ చేసిన కుల్దీప్ సఫారీల ఇన్నింగ్స్‌‌‌‌ను ముగించాడు.

సంక్షిప్త స్కోర్లు
ఇండియా: 50 ఓవర్లలో 326/5 (కోహ్లీ 101*, అయ్యర్ 77, కేశవ్‌‌‌‌ 1/30)
సౌతాఫ్రికా: 27.1 ఓవర్లలో 83 ఆలౌట్ (జాన్సెన్ 14, జడేజా 5/33, కుల్దీప్ 2/7).