హైదరాబాద్, వెలుగు: తన బ్యాట్ పవర్‌తో వరల్డ్ క్లాస్ బౌలర్లకు ఎన్నో నిద్రలేని రాత్రులను మిగిల్చిన విరాట్ కోహ్లీ మంచి నిద్రతో మెంటల్ హెల్త్ బాగుంటుందని అంటున్నాడు. ఆరోగ్యకరమైన జీవనశైలిలో అత్యంత ముఖ్యమైన అంశాల్లో మంచి నిద్ర ఒకటన్నాడు.హైదరాబాద్‌లో సోమవారం ఓ ప్రమోషనల్ ఈవెంట్‌లో పాల్గొన్న విరాట్..ఫిట్‌నెస్, ఆరోగ్యంతో పాటు తగినంత నిద్రపోవడం వల్ల శరీరం మెరుగ్గా స్పందిస్తుందని తెలిపాడు. ఈ క్రమంలో డొమెస్టిక్ క్రికెట్ ఆడుతున్నప్పుడు నిద్రలేకపోవడం వల్ల తనకు ఎదురైన పరిస్థితిని వివరించాడు.
‘ఓసారి నేను 3డే గేమ్ కోసం కోల్‌కతాకు వెళ్లా. తొలి రోజు ఆటలో సెంచరీ చేసి నాటౌట్‌గా నిలిచా. కానీ, ఆ రాత్రంతా మేల్కొనే ఉన్నా. ఉదయం 6.15 వరకూ నిద్రపోలేదు. నిద్రమత్తుతోనే తర్వాతి రోజు లంచ్ బ్రేక్ వరకు బ్యాటింగ్ చేశా. బ్రేక్ టైమ్‌లో నిద్రపోయా. రెండో సెషన్ కోసం గ్రౌండ్‌కు వెళ్లాలంటూ ఎవరో వచ్చి లేపేంత వరకు గాఢ నిద్రలో ఉండిపోయా. ఇప్పుడు అలాంటి పనులు చేస్తానని కలలో కూడా ఊహించలేను. మంచి నిద్ర చాలా మంచి మానసిక ఆరోగ్యం ఇస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నా. ముఖ్యంగా మూడు ఫార్మాట్లలో ఆడుతున్నవారికి సరైన నిద్ర అవసరం. టీ20 మ్యాచ్‌లు ఆడుతున్నప్పుడు డే టైమ్‌లో నేను 30 నిమిషాలు కునుకు తీస్తా. అది మన ఎనర్జీని మరింత బూస్ట్ చేస్తుంది. నైట్ మ్యాచ్‌లు లేని టైమ్‌లో రాత్రి 9.45 గంటలకే పక్కాగా నిద్రపోతా. అంతకుముందే మొబైల్ పక్కనపెట్టేస్తా. ఇప్పుడు ఉదయం మా అమ్మాయి నిద్రలేపుతోంది’ అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
