IPL ట్రోఫీల కంటే.. RCB అభిమానుల ప్రేమే ఎక్కువ: విరాట్ కోహ్లీ

IPL ట్రోఫీల కంటే.. RCB అభిమానుల ప్రేమే ఎక్కువ: విరాట్ కోహ్లీ

ఐపీఎల్‎లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (ఆర్సీబీ) టాప్ ప్లేస్‎లో ఉంటుంది. ఇందులో నో డౌట్. ఇప్పటి వరకు ఒక్క ట్రోఫీ గెలవకున్నా కోట్ల మంది ఫ్యాన్స్ ఆర్సీబీ సొంతం. ఈసాలా కప్ నమ్దే అంటూ దిగడం.. చివరకు ట్రోఫీ లేకుండానే వెనుదిరగడం కామన్‎గా మారిపోయింది. 18 సీజన్లుగా ఇదే సీన్ రిపీట్ అవుతోంది. ఒక్క టైటిల్ కూడా లేదంటూ ఇతర జట్ల అభిమానులు ఆర్సీబీ ఫ్యాన్స్‎ను సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తుంటారు.  అయినప్పటికీ రోజురోజుకు ఆర్సీబీకి ఫ్యాన్స్ పెరుగుతున్నారే తప్ప.. తగ్గడం లేదు. తమ జట్టుపై అంత విధేయత చూపిస్తున్నారు ఆర్సీబీ ఫ్యాన్స్. ఈ క్రమంలోనే ఆర్సీబీ అభిమానుల ప్రేమ, విధేయతపై ఆ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. 

Also Read : తండ్రి RCB.. కొడుకు SRH: బెంగళూరు జెర్సీలో సర్‌ప్రైజ్ చేసిన నితీష్ కుమార్ ఫాదర్

తాజాగా.. కోహ్లీ RCB పాడ్‌కాస్ట్‎లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్సీబీ జట్టు నుంచి ఎప్పుడైనా వెళ్లిపోవాలని ఆలోచించారా అన్న ప్రశ్న కోహ్లీకి ఎదురైంది. 18 సీజన్లుగా ఒక్క ట్రోఫీ గెలవకున్నా.. ఆర్సీబీ అభిమానుల నుంచి నాకు లభించిన ప్రేమకు ఏది సాటిరాదని.. ఇంత గొప్ప జట్టును వదిలి వెళ్లాలని ఎప్పుడు అనుకోలేదని ఆన్సర్ ఇచ్చాడు విరాట్. ఆర్సీబీ అభిమానుల ప్రేమ, విధేయతకు ఏ ట్రోఫీ దరిదాపులోకి కూడా రాదన్నారు. ట్రోఫీ కంటే ఆర్సీబీ అభిమానుల లవ్, లాయల్టీకే తాను ఎక్కవ విలువ ఇస్తానని చెప్పారు. 

ఇక.. ఫామ్ లో ఉండగానే అంతర్జాతీయ టీ20 ఫార్మాట్ నుంచి తప్పుకోవడంపైన క్లారిటీ ఇచ్చారు. యంగ్ ప్లేయర్స్ కు అవకాశం ఇవ్వాలనే ఇంటర్నేషనల్ టీ20లకు వీడ్కోలు పలికానని చెప్పారు.  వచ్చే టీ20  ప్రపంచ కప్‎కు యంగ్ ప్లేయర్ల పూర్తిగా సన్నద్ధం కావాలని.. వారికి  సరైన సమయం దక్కాలనే తాను పక్కకు తప్పుకున్నానని వివరణ ఇచ్చారు. కోహ్లీ భారతదేశం తరపున మొత్తం 125 T20Iలు ఆడి 48.69 సగటుతో 4188 పరుగులు చేశాడు. 2024 టీ20 ప్రపంచ కప్ తర్వాత పొట్టి ఫార్మాట్ నుంచి రిటైర్ అయ్యాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్ 2025లో ఆర్సీబీ అద్భుతంగా రాణిస్తోంది. ఇప్పటివరకు 10 మ్యాచ్‌ల్లో ఆడి అందులో ఏడు విజయాలు సాధించి.. ప్లే ఆఫ్స్‎కు చేరువలో ఉంది. కోహ్లీ 443 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్నాడు.