Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన గురువు, చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మపై ఉన్న గురుభక్తిని చాటుకున్నారు. గురువును గౌరవించడంలో తాను ఎప్పుడూ ముందే ఉంటానని కింగ్ మరోసారి నిరూపించారు. తన బ్రాండ్ 'One8' నుంచి ప్రత్యేకంగా డిజైన్ చేసిన సరికొత్త షూస్‌ను కోచ్‌కు బహుమతిగా ఇస్తూ, తన కోచ్ కాళ్లకు కోహ్లీ నమస్కరించిన వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో.. ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
ట్రోఫీలు గెలిచినా.. ఈ ఫీలింగ్ వేరు:-
దాదాపు 25 సంవత్సరాల క్రితం, ఒక వ్యక్తి ఒక చిన్న పిల్లాడి (నా)పై నమ్మకంతో పందెం కాశారు.. ఆయనే నా మొదటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ సర్.. నాకు తెలిసిన సమస్తాన్ని ఆయనే నేర్పించారు.. క్రికెట్‌కు నివాళిగా మేము రూపొందించిన మొదటి జత షూస్ (Seam XVIII)ను నాకు సర్వస్వం ఇచ్చిన నా కోచ్‌కు అందించడం సంతోషంగా ఉంది. నా కెరీర్‌లో ఎన్నో ట్రోఫీలు అందుకున్నాను, కప్పులు ఎత్తాను.. కానీ ఈ బాక్స్‌ను సర్ చేతికి ఇస్తున్నప్పుడు కలిగిన ఫీలింగ్ పూర్తిగా వేరు.. నాకు ప్రతిదీ ఇచ్చిన క్రికెట్ ఆటను నేర్పిన వ్యక్తికి నేను చెప్పే చిన్న థాంక్స్ ఇది.. థాంక్యూ సర్.. ఎల్లప్పుడూ మీరే.. నా గురువు అని విరాట్ పేర్కొన్నాడు.
ప్రత్యేకమైన రెడ్-బాల్ షూస్:
విరాట్ కోహ్లీ తన బ్రాండ్ 'One8' ద్వారా క్రికెట్ టెస్ట్ మ్యాచ్‌లలో వాడే రెడ్ బాల్ (ఎరుపు రంగు బంతి) థీమ్‌తో ఈ షూస్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. దీనికి ‘Seam XVIII’ అని పేరు పెట్టారు. బ్రైట్ రెడ్ కలర్‌లో మెరిసిపోతున్న ఈ షూస్‌పై 'One8' లోగో ఉంది. ఈ బహుమతిని అందుకున్న రాజ్‌కుమార్ శర్మ.. కోహ్లీ ఆలోచనను, ఆ షూస్ డిజైన్‌ను ఎంతగానో అభినందించారు.
ALSO READ : లైవ్‌లో తిట్టుకున్నారు.. కట్ చేస్తే సీన్ రివర్స్
నెట్టింట కోహ్లీపై ప్రశంసలు:
ఇటీవల ఢిల్లీలోని DPS RK పురంలో వెస్ట్ ఢిల్లీ క్రికెట్ అకాడమీ (WDCA) కొత్త బ్రాంచ్ ప్రారంభోత్సవంలో వీరిద్దరూ కలుసుకున్నారు. గురువు పట్ల కోహ్లీ చూపించిన ఈ గౌరవంపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు "కింగ్ ఈజ్ ఆల్వేస్ కింగ్" అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
