
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దాదాపు నాలుగు నెలల తర్వాత ఇండియాలో అడుగుపెట్టాడు. మంగళవారం (అక్టోబర్ 14) న్యూఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నాడు. విరాట్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీడియా హడావిడిని తప్పించుకున్న ఈ టీమిండియా మాజీ కెప్టెన్ తన కారు వద్దకు వేగంగా వెళ్ళాడు. బ్లాక్ షర్ట్, వైట్ ప్యాంటులో కనిపించిన కోహ్లీ లుక్ వావ్ అనేలా ఉంది. కోహ్లీ ఇండియాకు చేరుకోవడంతో సోషల్ మీడియాలో అభిమానులు సంతోషంతో కోహ్లీకి స్వాగతం చెబుతున్నారు.
The GOAT is here !!!! 🐐 pic.twitter.com/u71bN56eMH
— Virat Kohli Fan Club (@Trend_VKohli) October 14, 2025
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కోసం ప్రకటించిన 15 మంది స్క్వాడ్ లో విరాట్ కోహ్లీ చోటు దక్కించుకున్నాడు. అక్టోబర్ 19 నుంచి జరగనున్న ఈ మెగా సిరీస్ లో కోహ్లీ ఆడనున్నాడు. దాదాపు 7 నెలల తర్వాత కోహ్లీను మైదానంలో చూసేందుకు ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఐపీఎల్ తర్వాత విరాట్ కోహ్లీ ఎలాంటి క్రికెట్ ఆడలేదు. టెస్ట్, టీ20 క్రికెట్ కు గుడ్ బై చెప్పిన విరాట్.. ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. తొలిసారి ఐపీఎల్ టైటిల్ గెలిచిన తర్వాత గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్న విరాట్.. ఆ తర్వాత లండన్ వెళ్ళాడు. నాలుగు నెలల పాటు లండన్ లో గడిపిన కోహ్లీ ఎట్టకేలకు ఆస్ట్రేలియా సిరీస్ కోసం ఇండియాలో అడుగుపెట్టాడు.
అక్టోబర్ 19 నుంచి టీమిండియా మూడు వన్డేల సిరీస్ కోసం కోహ్లీ ఆస్ట్రేలియాలో పర్యటించనున్నాడు. 36 ఏళ్ళ కోహ్లీ టీ20, టెస్ట్ క్రికెట్ కు ఇప్పటికే తన రిటైర్మెంట్ ప్రకటించాడు. 2027 వన్డే వరల్డ్ కప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. ఈ ఏడాది టెస్ట్ లకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ.. ఇండియా తరఫున 123 టెస్టులు ఆడి 9230 రన్స్ చేశాడు. ఇందులో 30 సెంచరీలు, 31 ఫిఫ్టీలు ఉన్నాయి. గత ఏడాది టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత పొట్టి ఫార్మాట్ కు గుడ్ బై చెప్పాడు.