RR vs RCB: కోహ్లీకే ఎందుకిలా..? అహ్మదాబాద్‌లో విరాట్‌కు చేదు జ్ఞాపకాలు

RR vs RCB: కోహ్లీకే ఎందుకిలా..? అహ్మదాబాద్‌లో విరాట్‌కు చేదు జ్ఞాపకాలు

క్రికెట్ లో విరాట్ కోహ్లీకి బ్యాడ్ లక్ కొనసాగుతుంది. తన జట్టుకు టైటిల్ అందించలేకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఓ వైపు భారత క్రికెట్ జట్టుకు మరో వైపు తాను ఐపీఎల్ లో ప్రాతినిధ్యం వహిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరపున శాయశక్తులా పోరాడుతున్నా.. టైటిల్ అందించడంలో విఫలమవుతున్నాడు. తాజాగా బుధవారం రాజస్థాన్ చేతిలో ఆర్సీబీ  4 వికెట్ల తేడాతో ఓడిపోవడంతో మరోసారి ట్రోఫీ కలగానే మిగిలిపోయింది. దీంతో విరాట్ కోహ్లీకి మరోసారి హార్ట్ బ్రేక్ తప్పలేదు. 

తన పాత్ర సమర్ధంగా పోషిస్తూ 100 శాతం కష్టపడే విరాట్ కోహ్లీకి అహ్మదాబాద్ గ్రౌండ్ వరుసగా రెండు సార్లు చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. ఒకటి భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన వరల్డ్ కప్ ఫైనల్. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియాపై వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఓటమి కోహ్లీని తీవ్రంగా బాధించింది.

మ్యాచ్ ఓటమి తర్వాత క్యాప్ తో స్టంప్స్ ను పడగొట్టి తలదించుకుని వెళ్ళిపోయాడు. టోర్నీ అంతటా అసాధారణ ఆటతీరుతో కోహ్లీ 765 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడంతో ఆ బాధను జీర్ణించుకోలేకపోయాడు. ఇక ఐపీఎల్ లో భాగంగా నిన్న (మే 22) రాజస్థాన్ తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో బెంగళూరు ఓడిపోవడంతో కోహ్లీ మరోసారి స్టంప్స్ ను పడేసి తన బాధను తెలియజేశాడు. ఈ మ్యాచ్ కూడా అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగడం విశేషం. రెండు సార్లు విరాట్ గెలిస్తే చూడాలని అభిమానులు భారీగా తరలి వచ్చినా నిరాశ తప్పలేదు. 

ఈ మ్యాచ్ లో కోహ్లీ 24 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్ తో 33 పరుగులు చేసి చాహల్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఈ టోర్నీలో 741 పరుగులు చేసిన కోహ్లీ అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల లిస్ట్ లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ఉన్న ఆటళ్లలో పరాగ్ (567) మాత్రమే కోహ్లీ కంటే వెనకున్నాడు. వీరిద్దరి మధ్య 174 పరుగులు వ్యత్యాసం ఉండడంతో ఈ సీజన్ లో కోహ్లీ ఆరెంజ్ క్యాప్ అందుకోవడం దాదాపుగా ఖాయమైంది.