అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్

అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ముందస్తుగానే ఎన్నికలు వస్తాయనే ప్రచారం జరుగుతోంది. అందుకు తగినట్లుగానే రాష్ట్ర  ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందనే చర్చలు జరుగుతున్నాయి. దీంతో బీజేపీ అలర్ట్ అయ్యింది. నిత్యం ప్రజల్లో ఉండేలా వ్యూహాలు రచిస్తోంది. రాష్ట్ర  ప్రభుత్వ వైఫల్యాలు, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలను ప్రజలకు వివరించే పనిలో నేతలు నిమగ్నమయ్యారు. తాజాగా అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా కోర్ కమిటీ, పదాధికారుల సమావేశం స్టేట్ ఆఫీస్ లో జరిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ తరుణ్ చుగ్ తో పాటు కోర్ కమిటీ సభ్యులు వివేక్ వెంకటస్వామి, డీకే అరుణ, విజయశాంతి, మురళీధర్ రావు పాల్గొన్నారు. కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రజా సంగ్రామ యాత్ర, ప్రజా గోస-బీజేపీ భరోసా కార్యక్రమం, పార్లమెంట్ ప్రవాస్ యోజన, కేంద్రమంత్రుల పర్యటనలపై చర్చించారు. ముందస్తు ఎన్నికలు వచ్చినా రెడీగా ఉండాలని నేతలకు సూచించారు. ప్రజా సమస్యలపై మరింత దూకుడుగా వెళ్లాలని దిశా నిర్దేశం చేశారు. 

జనవరి 7న బూత్ కమిటీలతో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా వర్చవల్ గా భేటీ కానున్నారు. రాష్ట్రంలో 34వేల 600 బూత్ కమిటీలు ఉన్నాయి. ఒక్కో బూత్ కమిటీలో 21మంది సభ్యులు ఉన్నారు. 34వేల 600 బూత్ కమిటీల్లోని 21 మంది సభ్యుల చొప్పున మొత్తం.. 7లక్షల 26వేల 600మందితో వర్చువల్ గా జేపీ నడ్డా సమావేశం కానున్నారు.