
న్యూఢిల్లీ: వ్యాక్సిన్ తీసుకున్నాక కూడా మాస్కు కట్టుకోవాలని, సోషల్ డిస్టెన్సింగ్ నియమాలను తప్పక పాటించాలని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్ దీప్ గులేరియా అన్నారు. కరోనా కొత్త మ్యూటెంట్ల వ్యాప్తి, వ్యాక్సిన్ ప్రభావంపై ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో గులేరియా పైవ్యాఖ్య చేశారు. టీకా తీసుకున్న వారు ఇండోర్, ఔట్ డోర్‌లో మాస్కులు కట్టుకొని తిరగాల్సిన అవసరం లేదని యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) సూచించిన నేపథ్యంలో గులేరియా వ్యాఖ్యలు ఆసక్తిని సంతరించుకున్నాయి.
'మరింత సమగ్ర సమాచారం అందే వరకు మనం మరింత జాగరూకతతో ఉండాలి. కరోనా చాలా తెలివైనది. ఎప్పటికప్పుడు రూపాంతరం అవుతున్న ఈ వైరస్ తో అప్రమత్తంగా ఉండాలె. కొత్త వేరియంట్ లు వస్తున్నందున రక్షణ విషయంలో శ్రద్ధ వహించడం ముఖ్యం. మాస్కులు ధరిస్తూ సామాజిక దూరాన్ని పాటిస్తే ఎన్ని వేరియంట్ లు వచ్చినా ఏమీ చేయలేవు' అని గులేరియా స్పష్టం చేశారు.