కెనడియన్లకు ఎప్పటిలాగే వీసాలు.. కెనడాలోని భారత్​ హైకమిషన్ నిర్ణయం

కెనడియన్లకు ఎప్పటిలాగే వీసాలు.. కెనడాలోని భారత్​ హైకమిషన్ నిర్ణయం

టొరంటో: భారత్, కెనడా మధ్య ఉద్రిక్త పరిస్థితుల వేళ ఒట్టావాలోని  భారత హైకమిషన్ ఆఫీస్ కీలక నిర్ణయం తీసుకుంది. కెనడియన్‌లకు వీసా సేవలను పునరుద్ధరిస్తున్నట్లు బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. అయితే ప్రస్తుతం ఎంట్రీ వీసా, బిజినెస్ వీసా, మెడికల్ వీసా, కాన్ఫరెన్స్ వీసాల సేవలను మాత్రమే జారీ చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఈ సేవలు గురువారం నుంచే అందుబాటులోకి వస్తాయని తెలిపింది. ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేసుకుంటూ నిర్ణయాలు తీసుకోనున్నట్లు పేర్కొంది.  

స్వాగతించిన కెనడా

కెనడియన్‌లకు వీసా సేవలను తిరిగి ప్రారంభించాలనే భారత్ నిర్ణయాన్ని కెనడా స్వాగతించింది. ఈ నిర్ణయం చాలా మంది కెనడియన్లకు ఊరట కలిగించిందని కెనడా ఇమ్మిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ అన్నారు. వీసా సేవలను మళ్లీ  నిలిపివేయకూడదని కోరుకుంటున్నట్లు చెప్పారు. భారత్‌తో  ఆందోళనకరమైన పరిస్థితి కెనడాలోని అనేక  కమ్యూనిటీలలో  భయాన్ని సృష్టించిందని తెలిపారు. సిక్కు మతానికి చెందిన కెనడా ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ మినిస్టర్  హర్జిత్ సజ్జన్ స్పందిస్తూ.. వీసా ప్రక్రియను పునఃప్రారంభించడం శుభపరిణామమని అన్నారు. 

పెండ్లిళ్లు, అంత్యక్రియలు వంటి కార్యక్రమాలకు ఇండియన్లు, కెనడియన్లు రాకపోకలు కొనసాగించడం ముఖ్యమని చెప్పారు. వీసా పునరుద్ధరణ ద్వారా కెనడాకు ఢిల్లీ ఎలాంటి సందేశాన్ని పంపేందుకు ప్రయత్నిస్తుందో ఊహించలేమని అభిప్రాయపడ్డారు. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, ఈ విషయంలో ఒట్టావా  భారత్ సాయాన్ని కోరుతున్నదని తెలిపారు. జూన్‌లో బ్రిటిష్ కొలంబియాలో ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు గురయ్యాడు. అతడి హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. అప్పటి నుంచి భారత్, కెనడా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.