
- ఎడపల్లి మండలం కుర్నపల్లిలో గుర్తించిన పరిశోధకులు
హైదరాబాద్, వెలుగు: నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం కుర్నాపల్లిలో విశ్వబ్రాహ్మణుల ఆరాధ్య దైవమైన విశ్వకర్మ శిల్పం వెలుగులోకి వచ్చింది. గ్రామ శివాలయం ఆవరణలో ఒక చెట్టు కింద ఉన్నవిగ్రహాన్ని పబ్లిక్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ హిస్టరీ, ఆర్కియాలజీ అండ్ హెరిటేజ్(ప్రిహా) కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు, చరిత్ర పరిశోధకుడు బొగ్గుల శంకరరెడ్డి గుర్తించారు. ఈ విగ్రహం శైలి ని బట్టి చాళుక్య- కాకతీయుల నాటిదని ప్రిహా ఉపాధ్యక్షుడు, శాసన పరిశోధకుడు డాక్టర్ దామరాజు సూర్యకుమార్ అభిప్రాయపడ్డారు. విశ్వకర్మ విగ్రహాలు రాష్ట్రంలో ఇప్పటి వరకు చాలా అరుదుగానే లభించాయని ఆయన వెల్లడించారు. విశ్వకర్మ పక్కన మామ్మాయి దేవత ఉండటం ఈ శిల్పంలో ప్రత్యేకత అన్నారు. మామ్మాయి దేవత గుళ్లు తెలంగాణలో పెద్దపల్లి, ఇబ్రహీంపట్నం వంటి చోట్ల ఉన్నప్పటికీ విశ్వకర్మ, మామ్మాయి ఒకే శిల్పంలో ఉండటం ఇదే మొదటిసారి అని వెల్లడించారు. సుమారు రెండు అడుగుల పొడవు, రెండడుగుల వెడల్పు ఉన్నట్లు శంకర్ రెడ్డి తెలిపారు. లోహ, శిల్ప శాస్త్రాల్లో ఆరితేరిన విశ్వ బ్రాహ్మణుల ఆరాధ్య దైవం విశ్వకర్మ విగ్రహం నిజామాబాద్ జిల్లాలో లభించడానికి కారణం ఈ ప్రాంతమంతా వేల ఏండ్లుగా ఇనుము, ఉక్కు పరిశ్రమలో నిమగ్నమై ఉండటమేనని ప్రిహా అధ్యక్షుడు, డాక్టర్ శ్రీపెరుంబుదూర్ జైకిషన్ వెల్లడించారు. మొదటి విశ్వకర్మ శిల్పాన్ని 2019లో వరంగల్ జిల్లా ముప్పారం(ధర్మసాగర్)లో డాక్టర్ హిందోళ వెలుగులోకి తెచ్చినట్లు గుర్తు చేశారు.