దేశ ఆర్థికవ్యవస్థ గురించి మాట్లాడేటప్పుడు నేటికీ మనదృష్టి పెద్ద పరిశ్రమలు, కార్పొరేట్ సంస్థలు, సేవా రంగం, సాంకేతిక విప్లవం చుట్టూనే తిరుగుతోంది. కానీ, ఈ ఆధునిక ఆర్థిక వ్యవస్థకు పునాది వేసిన శ్రామిక వర్గం ఎవరు? అనే ప్రశ్నకు సమాధానం వెతికితే..
శతాబ్దాలుగా నిశ్శబ్దంగా దేశనిర్మాణంలో భాగస్వాములై ఉన్న విశ్వకర్మలే ముందుగా కనిపిస్తారు. వారు కేవలం కార్మికులు కాదు. సృష్టికర్తలు. వారి చేతుల నైపుణ్యమే భారత ఆర్థిక వ్యవస్థకు అసలైన మూలధనం. వ్యవసాయం దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న వేళ ఆ వ్యవసాయాన్ని నడిపించే పనిముట్ల తయారీ విశ్వకర్మల చేతుల్లోనే రూపుదిద్దుకుంది. భూమి దున్నే ప్రక్రియలో ఉపయోగించే నాగళ్లు, పలుగులు, ఇనుప పనిముట్లు వంటి వ్యవసాయ పరికరాల తయారీ, మరమ్మతులు శతాబ్దాలుగా వారి వృత్తిగా కొనసాగుతున్నాయి.
దేశ ఉత్పాదకతకు బలం.. విశ్వకర్మల శ్రమ
రైతు చేతిలో ఉన్న ప్రతి పనిముట్టు వెనుక విశ్వకర్మల శ్రమ దాగి ఉంది. ఈ పరికరాలే గ్రామీణ ఆర్థిక వ్యవస్థను చక్రంలా తిప్పుతూ దేశ ఉత్పాదకతకు బలం చేకూర్చాయి. పట్టణీకరణ, ఆధునికీకరణ వేగంగా జరుగుతున్న ఈ కాలంలోనూ విశ్వకర్మల అవసరం తగ్గలేదు. భవన నిర్మాణం, మౌలిక వసతుల అభివృద్ధి, రహదారులు, వంతెనలు, నివాస సముదాయాల నిర్మాణంలో పనిచేస్తున్నవారు, చెక్కపనివారు, మేస్త్రీలు, వీరంతా విశ్వకర్మ వృత్తుల ఆధునిక రూపాలే.
నిర్మాణ రంగం దేశ స్థూల దేశీయోత్పత్తిలో కీలక వాటా అందిస్తుంటే ఆ రంగానికి మౌలిక శ్రమ అందిస్తున్నది ఇదే వర్గం. అలాగే భారతీయ శిల్పకళకు ప్రపంచవ్యాప్తంగా లభిస్తున్న గుర్తింపులో విశ్వకర్మల పాత్ర అపారమైనది. రాతి శిల్పాలు, లోహ విగ్రహాలు, చెక్క కళాకృతులు, మట్టితో చేసిన హస్తకళా వస్తువులు దేశానికి విదేశీ మారకద్రవ్యాన్ని సమకూర్చుతున్నాయి. ‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మనిర్భర్ భారత్’ వంటి నినాదాలకు అసలైన ప్రాణం ఈ సంప్రదాయ నైపుణ్యాలే అని గుర్తించాల్సిన అవసరం ఉంది.
సంప్రదాయ వృత్తులకు భద్రత కల్పించాలి
ఎంతో ప్రాధాన్యం ఉన్నప్పటికీ విశ్వకర్మల జీవన పరిస్థితులు ఆందోళనకరంగానే ఉన్నాయి. యంత్రాల ఆధిపత్యం, కార్పొరేట్ ఉత్పత్తులు, మధ్యవర్తుల దోపిడీ కారణంగా సంప్రదాయ వృత్తులు సంక్షోభంలో పడ్డాయి. నైపుణ్యం ఉన్నా గిట్టుబాటు ధర లభించకపోవడం, ముడిసరుకు ఖర్చులు పెరగడం, మార్కెటింగ్ మద్దతు లేకపోవడం వారిని ఆర్థికంగా వెనుకబాటుకు నెడుతోంది. ఇది వ్యక్తిగత సమస్య మాత్రమే కాదు. దేశ ఆర్థికవ్యవస్థకు కూడా నష్టమే.
విశ్వకర్మల నైపుణ్యాన్ని ఆధునిక సాంకేతికతతో సమన్వయం చేస్తే దేశానికి అపారమైన లాభం చేకూరుతుంది. నైపుణ్యాభివృద్ధి శిక్షణలు, తక్కువ వడ్డీ రుణాలు, ముడిసరుకు సబ్సిడీలు, నేరుగా మార్కెట్‌కు చేరుకునే వేదికలు కల్పిస్తే గ్రామీణ ఆర్థికవ్యవస్థ బలపడుతుంది. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. వలసలు తగ్గుతాయి. దేశీయ ఉత్పత్తి పెరుగుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థను కేవలం గణాంకాల ద్వారా కాకుండా దాన్ని నిర్మించే చేతుల ద్వారా చూడాల్సిన సమయం ఇది.
విశ్వకర్మల శ్రమను నిర్లక్ష్యం చేయడం అంటే దేశ అభివృద్ధి మూలాలను నిర్లక్ష్యం చేయడమే. వారి వృత్తులకు గౌరవం, భద్రత, స్థిరత్వం కల్పించడమే నిజమైన ఆర్థిక సంస్కరణ. విశ్వకర్మల చేతుల్లో ఉన్న నైపుణ్యం దేశ సంపద. ఆ సంపదకు తగిన విలువ లభించిన రోజే భారత ఆర్థిక వ్యవస్థ నిజమైన అర్థంలో బలపడుతుంది. అదే సమగ్ర అభివృద్ధికి మార్గం.
- తిప్పర్తి శ్రీనివాస్
