
‘చెక్క భజనాలాడి.. రాములోరి గొప్ప చెప్పుకుందామా..’ అంటూ చిరంజీవి డ్యాన్స్ చేసిన ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. ఆయన హీరోగా వశిష్ట దర్శకత్వంలో రూపొందుతోన్న ‘విశ్వంభర’ చిత్రం కోసం కీరవాణి ఈ భక్తి గీతాన్ని కంపోజ్ చేశారు. ఇటీవల విడుదలైన ఈ పాట యూట్యూబ్‌లో ఇరవై ఐదు మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి అన్ని మ్యూజిక్ చార్ట్స్‌లో టాప్ ట్రెండింగ్ కొనసాగుతూ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్‌ను అందించగా, శంకర్ మహదేవన్, లిప్సిక పాడిన తీరు అందర్నీ అలరించింది. చిరంజీవిపై సీతారాముల కళ్యాణం నేపథ్యంలో కలర్‌ఫుల్‌గా ఈ పాటను చిత్రీకరించారు.
‘జై శ్రీ రామ్’ నినాదాన్ని ప్రతిధ్వనించేలా ఈ ఆడియో సాంగ్‌ను పెన్ డ్రైవ్‌లో స్టోర్ చేసి ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని శ్రీరామ, హనుమాన్ టెంపుల్స్‌కు కానుకగా ఇచ్చారు. దీంతో ఈ పాట ప్రతి ఆలయంలోనూ మార్మోగుతోంది. ఇక ఈ చిత్రంలో త్రిష, ఆశికా రంగనాథ్ హీరోయిన్స్‌గా నటిస్తుండగా, కునాల్ కపూర్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయనున్నారు.