మాతృదేవోభవ, పితృ దేవోభవ అంటారు పెద్దలు. అంటే తల్లిదండ్రులు దైవంతో సమానం అని. వాళ్లు చూపించే ప్రేమ, ఆప్యాయత వేరే ఏ బంధంలోనూ కనిపించదు. పిల్లలు ఎంత అల్లరి చేసినా, వాళ్ల వల్ల ఎన్ని నష్టాలు జరిగినా సహనంతో ఉండడం కూడా వాళ్లకే చెల్లింది. అదేవిధంగా పిల్లల్ని కూడా దైవంతో పోలుస్తుంటారు. ఎందుకంటే వాళ్లు ఏమీ తెలియని అమాయకులు, చిరునవ్వులు పూయించే ముద్దుబిడ్డలు.
అయితే, ఇదంతా ఒకప్పుడు..! ఇప్పుడు కాలం మారింది అని అప్పుడప్పుడు తల్లిదండ్రులు పిల్లల పట్ల ప్రవర్తించే తీరు చెప్పకనే చెప్తోంది. పిల్లలు బయటికి వెళ్లినప్పుడు ఎలా ఉంటున్నారో? వాళ్లు చేసే కొన్ని పనులకు తల్లిదండ్రులు ఎందుకు సంజాయిషీ చెప్పుకోవాల్సి వస్తుందో? చాలామంది పేరెంట్స్ ఆలోచించట్లేదు. లోపం ఎక్కడుందో ఒక్కసారి పరిశీలిస్తే...
పిల్లల్ని చూసుకోవడం అనేది తల్లిదండ్రుల బాధ్యత. అయితే దాన్ని రెస్పాన్సిబిలిటీగా కాకుండా ఒక కాంపిటీషన్‌లా ఫీలవుతారు పేరెంట్స్. ఇదొక సైలెంట్ రేస్.. ఇందులో తమ పిల్లలు ప్రవర్తన, తెలివితేటలు, ఇతర విషయాల్లో ఉత్తమంగా ఉండాలని కోరుకుంటారు. నిజానికి అది బాధ్యతలా కాదు.. కొన్నిసార్లు భారంగా అనిపిస్తుంటుంది. ఎవరికీ చెప్పుకోలేని ఒక ఒత్తిడికి గురవుతుంటారు కొందరు తల్లిదండ్రులు.
మరికొందరు పేరెంట్స్ ప్లే డేట్స్‌ను ఆర్గనైజ్ చేస్తారు. పిల్లల కోసం గ్రాండ్‌గా బర్త్ డే పార్టీలు సెలబ్రేట్ చేస్తారు. ఇప్పటి మోడర్న్ పేరెంట్స్ అయితే పిల్లలు పుట్టినది మొదలుకొని, వాళ్లు నడిచేవరకు.. మాట్లాడేవరకు.. సొంతగా తినే వరకు ఇలా పిల్లలు ఎదిగే ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ, చిన్న విషయాలకు కూడా వేడుకలు జరుపుకుంటూ జ్ఞాపకాలను పోగుచేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో షేర్ చేయడం సర్వసాధారణం అయిపోయింది ఈరోజుల్లో. అలా ఎగ్జయిటింగ్‌గా మొదలైన జర్నీ వెంటనే ఎమోషనల్‌గా మారుతుంది. కొన్నిసార్లు చిరాకు కూడా తెప్పిస్తుంది. ఈ ప్రాసెస్‌లో ఎన్నోసార్లు బాధపడాల్సి వస్తుంది. ఒక పేరెంట్‌గా పిల్లలు ప్రతిదాంట్లో పర్ఫెక్ట్గా ఉండాలని ఎప్పుడైతే ఆలోచిస్తారో అప్పుడు పేరెంటింగ్ అనే ఎసెన్స్‌ను మిస్ అవుతున్నట్లే. అందుకే రీసెంట్గా తల్లిదండ్రులైనవాళ్లంతా మైండ్‌ఫుల్ పేరెంటింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు.
మైండ్‌ఫుల్ పేరెంటింగ్ అంటే..
బెంగళూరుకు చెందిన సైకియాట్రిస్ట్ దివ్య శ్రీ, మైండ్‌ఫుల్ పేరెంటింగ్ గురించి ఇలా చెప్పారు. ‘‘పిల్లలతో గడిపే సమయంలో మీ మైండ్‌ను పూర్తిగా వాళ్లవైపు ఉంచండి. వాళ్లు చెప్పేది శ్రద్ధగా వినండి. వాళ్లు చెప్పే విషయాల గురించి అవగాహన ఉండేలా చూసుకోండి. ఎట్టిపరిస్థితుల్లోనూ వాళ్లను జడ్జ్ చేయొద్దు. వాళ్లతో టైం స్పెండ్ చేసేటప్పుడు వేరే వాటిపై మనసును మళ్లించొద్దు. ఇలా చేయడం వల్ల పిల్లల మీద కోప్పడకుండా నెమ్మదిగా బదులు ఇవ్వగలుగుతారు. అప్పుడు పిల్లల ఫీలింగ్స్ పేరెంట్స్‌కు అర్థమవుతాయి. ఈ సవాళ్లను దాటాలంటే చాలా సహనంగా ఉండాలి”అని. దాంతోపాటు మైండ్‌ఫుల్ నెస్ అనేది ఒత్తిడిని మేనేజ్ చేయడానికి, ఎమోషనల్ బ్యాలెన్స్‌ను స్థిరంగా ఉంచడానికి, ఫ్యామిలీలో బలమైన బంధాలను నిర్మించడానికి సాయపడుతుంది. పేరెంట్స్ ఈ పద్ధతిని ఫాలో అయితే క్లిష్ట సమయాల్లో వాళ్ల ఆలోచనలు, ఎమోషన్స్ నెమ్మదిగా ఉంటాయి. ఇది కోపం, అరవడం, అపరాధభావం వంటి వాటిని తగ్గిస్తుంది. పిల్లలు చెప్పే విషయాలను ఓపికతో వింటారు. అలా చేయడం వల్ల ఒకరినొకరు బాగా అర్థం చేసుకోగలుగుతారు.
క్లినికల్ సైకాలజిస్ట్ మిమాన్సా సింగ్ మైండ్‌ఫుల్ పేరెంటింగ్ గురించి ఏమన్నారంటే.. ‘‘ఈ ప్రాసెస్‌లోనే ఒక పేరెంట్‌గా సెల్ఫ్ అవేర్నెస్, స్వీయ నియంత్రణ కలగలిసి ఉంటాయి. ఎమోషన్స్‌ను కంట్రోల్ చేసుకోవడం, వెంటనే రియాక్ట్ అవ్వడం, పిల్లల మీద అరవడం వంటివి చేయకుండా ఉంటారు. పిల్లలతో ఎదురయ్యే సవాళ్లను పేరెంట్స్ సరిగ్గా అర్థం చేసుకుంటారు. అందుకే చాలామంది ఈ మైండ్‌ఫుల్ పేరెంటింగ్ ప్రాసెస్‌ను ఇష్టపడుతున్నారు. గొడవలు తగ్గుతాయి. ఇంట్లో కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది.’’
పాత పద్ధతిలో లోపముందా?
మోడర్న్ పేరెంటింగ్ గురించి విన్న తర్వాత పాత పద్ధతుల్లో పిల్లల్ని పెంచడం వల్ల ఏమైనా ఇబ్బంది ఉందా? వాళ్ల ప్రాసెస్‌లో లోపం ఉందా? అనే డౌట్లు రావొచ్చు. వాటిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తే.. నాటికీ నేటికీ అన్ని విధాలుగా మారిన జీవన విధానమే కారణం అని తెలుస్తోంది. అప్పట్లో లైఫ్ సింపుల్‌గా ఉండేది.. కఠినమైన క్రమశిక్షణ, విధేయత ఉంటే సరిపోయేది. పిల్లలకు వేరే వాటి మీద వ్యామోహాలు కూడా తక్కువే ఉండేవి. ఇప్పుడు అలా కాదు.. వాళ్లకు ఎంతో అవగాహన ఉంది. స్వతంత్రంగా ఉండగలరు. టెక్నాలజీ, సోషల్ మీడియా ప్రభావం వాళ్లపై చాలా ఉంది. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎమోషనల్ సపోర్ట్ కావాలి. పనిష్మెంట్లు, రూల్స్ బదులు కమ్యూనికేషన్ ఓపెన్‌గా ఉండాలి. బిజీ షెడ్యూల్స్, పేరెంట్స్ రోల్స్ మారిపోవడం వల్ల కుటుంబాలు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. కాబట్టి అథారిటీ చూపిస్తే తిరుగుబాటు చేసే చాన్స్ ఉంది. పిల్లలు చేసిన తప్పు తల్లిదండ్రులకు తెలుసు అనుకుంటారు. వెంటనే పరిష్కారం చూడాలనుకుంటారు. అలాంటప్పుడే వాళ్ల మీద అరిచేస్తారు. అలాగే పిల్లలు ఇంతకుముందు ఎలా ప్రవర్తించారో దృష్టిలో పెట్టుకుని వాళ్ల మీద కోపం చూపిస్తుంటారు. కానీ, వాళ్ల ఎమోషన్ని అర్థం చేసుకోలేరు.
ఒక్క క్షణం ఆగి..
సాధారణంగా పిల్లలు అల్లరి చేసినప్పుడు వాళ్లని కంట్రోల్ చేయాల్సిన పరిస్థితుల్లో పేరెంట్స్ టెన్షన్ పడతారు లేదా కోప్పడతారు. మైండ్‌ఫుల్ నెస్ పద్ధతి ఫాలో అయ్యే పేరెంట్స్ రియాక్ట్ అవ్వడానికి ముందు ఒక నిమిషం ఆగి, ఆలోచిస్తారు. ఆ తర్వాత రియాక్ట్ అవుతారు. ఇది చిన్నదే కానీ, పవర్ఫుల్ హ్యాబిట్. ప్రశాంతంగా శ్వాస తీసుకుని వాళ్ల ఎమోషన్స్‌ను అర్థం చేసుకోండి. తర్వాత ఆలోచించి ప్రతిస్పందించండి. అరిచి, కోప్పడి చెప్పడం కంటే నెమ్మదిగా చెప్పడం అలవాటు చేసుకోండి. ఇది ప్రాబ్లమ్ సాల్వింగ్, సెల్ఫ్ కంట్రోల్, ఎమోషనల్ బ్యాలెన్స్, ఇంపార్టెంట్ లైఫ్ స్కిల్స్ నేర్పిస్తుంది. ఇలాంటి వాతావరణంలో పెరిగిన పిల్లలు పెద్దయ్యేకొద్దీ ఆలోచనాపరులు, మంచి సహచరులుగా మారతారు. ఫోన్, ఇతర విషయాలతో కాకుండా పిల్లలతో కలిసి క్వాలిటీ టైంని స్పెండ్ చేయండి. తప్పులు జరుగుతాయి అని పేరెంట్స్ యాక్సెప్ట్ చేయాలి. పర్ఫెక్షన్ మీద కాదు.. నేర్చుకోవడం మీద ఫోకస్ చేయండి. మైండ్‌ఫుల్ పేరెంటింగ్ కోసం మెడిటేషన్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్, కొత్త విషయాలు తెలుసుకోవడం వంటివి చేయండి. వాటివల్ల అవగాహన, నియంత్రణ పెరుగుతాయి. ఈ చిన్న చిన్న విషయాలే ప్రశాంతమైన, పాజిటివ్ పేరెంటింగ్‌గా మార్చుతుంది. తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య ఎమోషనల్ సపోర్ట్ పెరుగుతుంది.
చివరిగా తల్లిదండ్రులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే.. మైండ్‌ఫుల్ పేరెంటింగ్ అంటే జస్ట్ బీ ప్రెజెంట్. మీరు వాళ్ల మీద అటెన్షన్ ఉంచారని వాళ్లకు కూడా తెలియాలి. ఆ విధంగా మీరు వాళ్లు చెప్పేది వినాలి. వాళ్లతో మాట్లాడాలి, కలిసి ఎంజాయ్ చేయాలి. మీరు వాళ్లతో ఆటలు ఆడుతూనో, కబుర్లు చెప్తూనో ఉన్నప్పుడు ఫోన్లు, నోటిఫికేషన్ల గురించి పట్టించుకోకండి. వాళ్లకు మాత్రమే ఆ టైం కేటాయించండి. ఇవే మీ బంధాన్ని బలపరుస్తాయి.
