బైక్​ యాత్రకు అపూర్వ ఆదరణ

బైక్​ యాత్రకు అపూర్వ ఆదరణ

మంచిర్యాల/దండేపల్లి, వెలుగు: దేశంలోని పేదలకు ప్రధాని మోడీ ఇండ్లు కట్టిస్తే.. సీఎం కేసీఆర్​ కుటుంబం మాత్రం అవినీతి సొమ్ముతో ఫామ్​హౌస్​లు కట్టుకుందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు డాక్టర్​ జి.వివేక్​ వెంకటస్వామి ఆరోపించారు. అవినీతి విషయంలో కేసీఆర్​ దేశంలోనే నంబర్​ వన్​ అని, ఆయన అవినీతి నుంచి తెలంగాణకు విముక్తి కల్పించడం బీజేపీతోనే సాధ్యమని అన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్​రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ‘బీజేపీ భరోసా’ బైక్ యాత్రకు వివేక్​ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జిల్లా ఇన్​చార్జ్​ పల్లె గంగారెడ్డి, రఘునాథ్​రావుతో కలిసి గుల్లకోటలో పార్టీ జెండాను ఆవిష్కరించి బైక్​ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో ప్రజలనుద్దేశించి వివేక్​ మాట్లాడారు. 

కేసీఆర్​కు భయం పట్టుకుంది

ప్రజల సమస్యలు తెలుసుకోవాలన్న కేంద్ర మంత్రి అమిత్ షా ఆదేశాలతోనే బైక్ యాత్రలు నిర్వహిస్తున్నామని, మొదటి విడతలో చేపట్టిన 16 ర్యాలీలు విజయవంతం అయ్యాయని వివేక్​ చెప్పారు. గ్రామగ్రామాన జనం బీజేపీకి బ్రహ్మరథం పట్టడం చూసి కేసీఆర్​కు భయం పట్టుకుందన్నారు. ఆయనకు సొంత ఆస్తులు పెంచుకోవడంపై ఉన్న శ్రద్ధ ప్రజల సమస్యల పరిష్కారంపై లేదన్నారు. ప్రధాని మోడీ తెలంగాణకు సంవత్సరానికి 2 లక్షల ఇండ్ల చొప్పున ఇప్పటివరకు 16 లక్షల ఇండ్లు మంజూరు చేశారని చెప్పారు. అయితే కేసీఆర్, కేటీఆర్, కవిత ఫామ్​హౌస్​లు కట్టుకున్నారు తప్ప.. పేదలకు డబుల్ బెడ్రూమ్​ఇండ్లు కట్టడం లేదని ఆరోపించారు. హాస్టళ్లలో విద్యార్థులకు ప్రభుత్వం సరైన భోజనం కూడా పెట్టడం లేదని, అందుకే స్టూడెంట్లు అనారోగ్యానికి గురవుతున్నారని మండిపడ్డారు. మునుగోడులో బైఎలక్షన్ ఉన్నందునే ఇప్పుడు కేసీఆర్ ఆసరా పింఛన్లు ఇస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజలు బీజేపీని నమ్ముతున్నారని, కేసీఆర్​ను ఇంటికి సాగనంపడానికి సిద్ధమయ్యాయని చెప్పారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పొనుగోటి రంగారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి అందుగుల శ్రీనివాస్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు పత్తి శ్రీనివాస్, మండల అధ్యక్షుడు బొప్పు కిషన్ తదితరులు పాల్గొన్నారు.

బైక్​ యాత్రకు అపూర్వ ఆదరణ

లక్సెట్టిపేట మండలంలోని 16 గ్రామాల్లో సాగిన బైక్​ యాత్రకు ఊరూరా అపూర్వ ఆదరణ లభించింది. గుల్లకోటలో మొదలైన ర్యాలీ సూరారం, పోతపల్లి, అంకతిపల్లి, శాంతాపూర్, లక్ష్మీపూర్, తిమ్మాపూర్, బలరావుపేట, జెండవెంకటాపూర్, రంగపేట, హనుమంతపల్లి, చందారం, దౌడేపల్లి, పాత కొమ్ముగూడెం, కొత్త కొమ్ముగూడెం మీదుగా వెంకట్రావుపేట చేరుకుంది. గ్రామాల్లో ప్రజలను పలకరిస్తూ, వారి సమస్యలు తెలుసుకుంటూ వివేక్​ వెంకటస్వామి ముందుకుసాగారు. ఊరూరా బీజేపీ జెండాను ఆవిష్కరించారు. లక్ష్మీపూర్​లో పలువురు యువకులకు వివేక్​ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వెంకట్రావుపేటలో ఒగ్గు కళాకారులు డప్పు వాయిద్యాలతో వివేక్​ వెంకటస్వామి, ఇతర నాయకులకు ఘన స్వాగతం పలికారు.