మే, జూన్​లోనే అసెంబ్లీ ఎన్నికలొస్తయ్

మే, జూన్​లోనే అసెంబ్లీ ఎన్నికలొస్తయ్

పిట్లం, వెలుగు: రాష్ట్రంలో మే, జూన్​లోనే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని.. అందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, జుక్కల్ సెగ్మెంట్ పాలక్ వివేక్​ వెంకట స్వామి పిలుపునిచ్చారు. ‘‘డిసెంబర్​వరకు ఎన్నికలు ఉండవన్న భావనతో కార్యకర్తలు రిలాక్స్ కావొద్దు. ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రిపేర్​కావాలి. అలా అయితేనే మిగతా వారికన్నా ఒక అడుగు ముందుండి విజయం సాధించగలుగుతాం” అని ఆయన సూచించారు. బుధవారం బిచ్కుందలో నిర్వహించిన జుక్కల్ సెగ్మెంట్ కోర్ కమిటీ సమావేశానికి వివేక్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కామారెడ్డి జిల్లాలోని నాలుగు అసెంబ్లీ సీట్లలో బీజేపీనే గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలవడంతో పాటు మెజార్టీ కూడా ముఖ్యమేనని, అందుకోసం కష్టపడాలని చెప్పారు. ఈ నెల 7న బీజేపీ చీఫ్ ​జేపీ నడ్డాతో వర్చువల్ మీటింగ్ ఉంటుందని, నియోజకవర్గంలోని ప్రతి బూత్ ​నుంచి 22 మంది కార్యకర్తలు హాజరుకావాలని తెలిపారు. ఈ మీటింగ్ లోపు నియోజకవర్గంలో మిగిలిన అన్ని బూత్, గ్రామ కమిటీలను నియమించాలని సూచించారు. ఎన్నికల్లో బూత్​కమిటీల పాత్ర ప్రధానమని చెప్పారు. 

కొంచెం కష్టపడితే మునుగోడులో గెలిచేవాళ్లం.. 

మునుగోడు ఉప ఎన్నికలో మరో 5 శాతం ఎక్కువ కష్టపడితే గెలిచే వాళ్లమని వివేక్ అన్నారు. గెలవాల్సిన సీటును కోల్పోయామన్నారు. మునుగోడులో గెలిచి ఉంటే, రాష్ట్రంలో బీఆర్ఎస్ ​కనిపించేది కాదన్నారు. జుక్కల్​లో నిర్వహించిన ‘‘జనం గోస బీజేపీ భరోసా’’కు మంచి స్పందన వచ్చిందన్నారు. నియోజకవర్గంలోని నాయకులు మంచి సహకారం అందించారని, ఇదే స్ఫూర్తిని ఎన్నికల వరకు కొనసాగించాలని కోరారు. అనంతరం మండలాల వారీగా బూత్ మహా సమ్మేళనంపై చర్చించారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ అరుణతార, నిర్మల్ జిల్లా ప్రభారీ రితేశ్​రాథోడ్, సోమయప్ప స్వామి, జిల్లా సెక్రటరీ కాలకుంట్ల రాము, జహీరాబాద్​ఇన్ చార్జ్ పుల్కల్ సాయిలు తదితరులు పాల్గొన్నారు.