కల్వకుంట్ల కుటుంబాన్ని బంగారు కుటుంబంగా మార్చారు

కల్వకుంట్ల కుటుంబాన్ని బంగారు కుటుంబంగా మార్చారు

రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తానని చెప్పిన సీఎం కేసీఆర్.. తన కుటుంబాన్ని మాత్రం బంగారు కుటుంబంగా మార్చారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు , మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఆరోపించారు.  కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టుని సీఎం కేసీఆర్ నిర్మించారని చెప్పారు. దీని ద్వారా లక్ష కోట్ల ప్రజా ధనాన్ని వృథా చేశారని మండిపడ్డారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం వేంపల్లిలో ప్రజా గోస బీజేపీ భరోసా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన  వివేక్ వెంకట స్వామి.. బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఆ తర్వాత బీజేపీ నేతలతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. 

బీజేపీలో చేరిక.
గోదావరి వరదతో ఇండ్లు నీట మునిగి నష్టపోయిన కుటుంబాలను  వివేక్ వెంకట స్వామి పరామర్శించారు. ఆ తర్వాత వేంపల్లి గ్రామంలో బీజేపీ జెండాను ఆవిష్కరించారు. వివేక్ వెంకటస్వామి సమక్షంలో ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తలు బీజేపీలో చేరారు.  ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు రీ డిజైనింగ్ లోపాల వల్ల మంచిర్యాల, చెన్నూర్, మంథని పట్టణాలతోపాటు పలు గ్రామాలు, వేల ఎకరాల్లో పంటలు నీట మునుగుతున్నాయని వివేక్ వెంకటస్వామి అన్నారు. వరద బాధితులకు ఇప్పటివరకు పైసా పరిహారం ఇవ్వకపోవడం దారుణమన్నారు. గ్యాస్ సిలిండర్ పై మోడీ ఫోటో పెట్టాలని ఎమ్మెల్సీ  కవిత అనడం సరైంది కాదన్నారు. రాష్ట్రంలో మద్యం సీసాల పై కేసీఆర్, కవిత ఫోటోలు పెట్టాలని చురకలంటించారు.