ఊర్లలో పార్టీ బలం పెరుగుతున్నది

ఊర్లలో పార్టీ బలం పెరుగుతున్నది
  • బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్‌తో పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్
  • రాష్ట్రంలోని తాజా పరిస్థితులను వివరించిన మాజీ ఎంపీ

న్యూఢిల్లీ, వెలుగు: ప్రజా గోస – బీజేపీ భరోసా కార్యక్రమానికి క్షేత్ర స్థాయిలో ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి చెప్పారు. గ్రామాల్లో పార్టీ బలం పెరుగుతున్నదని అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న వివేక్‌.. బీజేపీ జనరల్ సెక్రటరీ, రాష్ట్ర ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్‌తో పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం భేటీ అయ్యారు. అర గంటకు పైగా జరిగిన సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో ప్రజా గోస– బీజేపీ భరోసా ప్రోగ్రాం నిర్వహించిన తీరును చుగ్‌కు వివేక్ వివరించారు. బైక్ ర్యాలీ జరిగిన సందర్భంలో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణ, ఇతర పరిణామాలపై చర్చించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అంశాలపైనా మాట్లాడుకున్నారు. ప్రజా గోస – బీజేపీ భరోసాతో గ్రామాల్లో బీజేపీ ఆదరణ పెరుగుతున్నదని వివేక్ వివరించారు. బైక్ ర్యాలీలు, రచ్చబండ కార్యక్రమాలతో ప్రజల చెంతకు చేరుతున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు కేంద్ర సంక్షేమ పథకాల పేర్లు మార్చుకొని, రాష్ట్ర ప్రభుత్వ పథకాలుగా కొనసాగిస్తున్న తీరుపై ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో బీజేపీ బలంగా లేదని చెబుతున్న నేతలకు కొద్ది రోజుల్లోనే సమాధానం దొరుకుతుందని వివరించారు. చాలా మంది నేతలు పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు చుగ్‌కు చెప్పారు. గ్రామస్థాయి నుంచి ఎమ్మెల్యేల వరకు కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్న నేతలపై చర్చించినట్లు తెలిసింది.

ఆరె కులాన్ని ఓబీసీలో చేర్చండి

సోషల్ జస్టిస్ సెక్రటరీ సుబ్రమణ్యానికి వివేక్ వెంకటస్వామి వినతి

ఆరె కులాన్ని ఓబీసీ జాబితాలో చేర్చేందుకు సహకారం అందించాలని కేంద్ర సామాజిక న్యాయ శాఖ సెక్రటరీ సుబ్రమణ్యంను మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి కోరారు. గురువారం ఢిల్లీలోని శాస్త్రి భవన్‌లో అరె సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిట్టిపల్లి శివాజీతో కలిసి సుబ్రమణ్యంతో ఆయన భేటీ అయ్యారు. అర గంటకుపైగా ఈ సమావేశం జరిగింది. ఆరె కులాన్ని ఓబీసీ జాబితాలో చేర్చే ప్రక్రియలో అడ్డంకిగా ఉన్న అంశాలపై వీరు చర్చించారు. తర్వాత శివాజీ మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయంతో తెలంగాణలోని దాదాపు 8 లక్షల మందికి మేలు జరుగుతుందని చెప్పారు. తమ విజ్ఞప్తులపై సోషల్ జస్టిస్ సెక్రటరీ సానుకూలంగా స్పందించారని, ఆరె కులస్థుల సమస్య గురించి పూర్తిగా విన్నారని తెలిపారు. ఆరె, మరాఠా తదితర కులాలను ఓబీసీలో చేర్చే అంశంలో చట్ట పరిధిలో తన పూర్తి సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఆరె కులాల సుదీర్ఘ కాల డిమాండ్‌ను పరిష్కరించడంలో కృషి చేస్తోన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, వివేక్ వెంకటస్వామికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.