నిరుద్యోగుల ఆత్మహత్యలకు  కేసీఆరే బాధ్యుడు

నిరుద్యోగుల ఆత్మహత్యలకు  కేసీఆరే బాధ్యుడు

జాబ్ ​నోటిఫికేషన్లు వేయకనే సూసైడ్స్: వివేక్ ​వెంకటస్వామి
లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరంతో ఒక్కరికీ జాబ్​రాలె
ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి హామీలు అమలు చేయాలె
 ఆత్మహత్య చేసుకున్న మహేశ్ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్​​ 
మంచిర్యాల, వెలుగు:రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యలకు సీఎం కేసీఆరే బాధ్యులని బీజేపీ నేషనల్​ఎగ్జిక్యూటివ్​కమిటీ మెంబర్, పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్​ వెంకటస్వామి అన్నారు. ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో వాళ్లు ప్రాణాలు తీసుకుంటున్నారన్నారు. ఉద్యమ సమయంలో ఇంటికో ఉద్యోగమని చెప్పి అధికారంలోకి వచ్చాక కేసీఆర్​మాట తప్పారని మండిపడ్డారు. ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా నోటిఫికేషన్లు వేస్తామని, యాభై వేల జాబ్స్ వస్తాయని నిరుద్యోగులను మోసం చేస్తున్నారని ఫైరయ్యారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం బబ్బెరచెల్కలో ఉద్యోగం రాక శనివారం ఆత్మహత్య చేసుకున్న ఆసంపల్లి మహేశ్ కుటుంబాన్ని సోమవారం సాయంత్రం వివేక్​ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసిన మహేశ్​కు ఉద్యోగం రాక కన్నవారికి భారంగా మారుతున్నాననే బాధతో సూసైడ్​ చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇచ్చినా మహేశ్​ బతికేవాడన్నారు. లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరంతో ఒక్కరికీ జాబ్ రాలేదని.. కేసీఆర్, మేఘా కృష్ణారెడ్డి మాత్రమే బాగుపడ్డారని విమర్శించారు. కమీషన్ల కోసం కట్టే ప్రాజెక్టులను పక్కనబెట్టి ఆ డబ్బుతో ఇండస్ర్టీలు పెడితే వేలాది మందికి జాబ్స్​ వస్తాయన్నారు. 
ఇప్పటికైనా నోటిఫికేషన్లు వేయాలె
చెన్నూర్​ఎమ్మెల్యే బాల్క సుమన్​ రూ. లక్ష ఇచ్చినంత మాత్రాన పోయిన ప్రాణం తిరిగి రాదని వివేక్​అన్నారు. కేసీఆర్ చిన్న కొడుకునని చెప్పుకుంటున్న సుమన్.. సీఎంతో మాట్లాడి నోటిఫికేషన్లు వేయించాలన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న హామీని కేసీఆర్​ నిలబెట్టుకోవాలని, ఇప్పటికైనా నోటిఫికేషన్లు వేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతిని అమలు చేయడంతో పాటు ఇప్పటివరకు ఒక్కొక్కరికీ బాకీపడ్డ రూ. లక్షన్నర మొత్తాన్ని చెల్లించాలన్నారు. హుజూరాబాద్​ బై ఎలక్షన్ రిజల్ట్​తోనైనా కేసీఆర్​లో మార్పు రావాలని అన్నారు. మహేశ్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 
కూలినాలి చేసి చదివించినం: మహేశ్​ తల్లిదండ్రులు
గుంట భూమి లేకున్నా కూలినాలి చేసి మహేశ్​ను చదివించామని, ఉద్యోగం చేసి సాదుకుంటాడని ఆశలు పెట్టుకున్నామని తల్లిదండ్రులు శివమ్మ, వెంకటి బోరున ఏడ్చారు. గవర్నమెంట్​ఉద్యోగం ఇయ్యకనే తమ కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. మహేశ్​ చావుతోనైనా సర్కారు కండ్లు తెరువాలని, ఇలాంటి గుండెకోత ఇంకెవరికీ రాకుండా చూడాలని వేడుకున్నారు. శివమ్మ నడుమునొప్పితో బాధపడుతుండగా వెంకటి కూడా పని చేయలేని స్థితిలో ఉన్నారు. ఆ కుటుంబం పరిస్థితిని చూసి వివేక్ చలించిపోయారు. ఏ కష్టం వచ్చినా బీజేపీ తరఫున అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. ఫైనాన్స్​ విషయంలోనే మహేశ్​ఆత్మహత్య చేసుకున్నాడని కేసును తప్పుదారి పట్టిస్తున్నారని గ్రామస్తులు మండిపడ్డారు. ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందనే ఆదివారమైనా డాక్టర్లను సంఘటన స్థలానికి పిలిపించి హడావుడిగా పోస్టుమార్టం చేశారని, పోలీసు బందోబస్తు మధ్య అంత్యక్రియలు జరిపించారని దుయ్యబట్టారు. వివేక్​వెంట బీజేపీ సీనియర్​ లీడర్ నగునూరి వెంకటేశ్వర్లు, రాష్ర్ట కార్యదర్శులు ముల్కల్ల మల్లారెడ్డి, రంగారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి అందుగుల శ్రీనివాస్, అధికార ప్రతినిధి తుల మధుసూదన్​రావు, లీడర్లు సుశీల్​కుమార్, చింతల శ్రీనివాస్, ఆకుల అశోకవర్ధన్, విశ్వంభర్​రెడ్డి, సోమ ప్రదీప్​చంద్ర, బోయిని హరికృష్ణ 
ఉన్నారు.