నేతన్నను సర్కార్ ఆదుకోవాలి: వివేక్‌‌ వెంకటస్వామి

నేతన్నను సర్కార్ ఆదుకోవాలి: వివేక్‌‌ వెంకటస్వామి

చేనేత వస్త్రాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకలని, నేత కార్మికులను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌‌ కోదండరాం కోరారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నల ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్ దాసు సురేష్ అధ్యక్షతన హైదరాబాద్‌‌లోని బషీర్‌‌బాగ్‌‌ ప్రెస్‌‌క్లబ్‌‌లో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. 2015లో తొలిసారి జాతీయ చేనేత దినోత్సవం ప్రకటించారన్నారు. నేత కార్మికుల శక్తికి, వారి కళాత్మక శ్రమకు ఇది గుర్తని చెప్పారు. చేనేత చారిత్రక సంపదని, దాన్ని కాపాడటానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ప్రజలూ చేనేతను ఆదరించాలని కోరారు.

నేతన్నల కుటుంబాలను ఆదుకోవాలి: వివేక్‌‌ వెంకటస్వామి

చేనేత కార్మికుల బకాయిలు వెంటనే విడుదల చేయాలన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత చనిపోయిన 350 మంది నేతన్నల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. నేతన్నలకు ఎక్కువ పని కల్పిస్తే భరోసా ఉంటుందని చెప్పారు.

ప్రభుత్వం స్పందించదా?: ఆర్‌‌. కృష్ణయ్య

నేతన్నలు ఇబ్బంది పడుతున్నా సర్కారు పట్టించుకోకపోవడం బాధాకరమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య అన్నారు. నేతన్నలందరికీ ఉచిత ఇన్సూరెన్స్, హెల్త్ కార్డులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ సూచించడం ఆహ్వానించదగిన విషయమన్నారు. నేతన్నల పోరాటంతోనే ఇది సాధ్యమైందన్నారు. దేశంలోని 20 కోట్ల మంది బలహీన వర్గాలకు ఇన్సూరెన్స్‌‌, హెల్త్‌‌ కార్డులు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. నేతన్నల ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్ సురేష్ మాట్లాడుతూ.. రైతులకు ఇచ్చినట్టే నేతన్నలకూ ఏడాదికి రూ.30 వేల పెట్టుబడి సాయం అందించాలని డిమాండ్‌‌ చేశారు. ఇటీవల మృతి చెందిన 30 మంది నేతన్నల కుటుంబాలకు రూ. 5 వేల చొప్పున ఆర్థిక సాయం అందించారు.