కమీషన్ల కోసమే కేసీఆర్​ కాళేశ్వరం కట్టాడు

కమీషన్ల కోసమే కేసీఆర్​ కాళేశ్వరం కట్టాడు

మంచిర్యాల, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీరింగ్​ అద్భుతం కాదని, రాష్ట్ర ప్రజలకు శాపమని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు డాక్టర్​ జి.వివేక్​ వెంకటస్వామి ఆరోపించారు. బ్యారేజీల బ్యాక్​ వాటరే వరదలకు కారణమని, దాని వల్ల మంచిర్యాల, చెన్నూర్, మంథని పట్టణాలు, అనేక గ్రామాలు, లక్షల ఎకరాల్లో పంటలు మునిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు వల్లే వరదలు వస్తున్నాయని ప్రజలు నిలదీస్తారనే భయంతోనే కేసీఆర్​ మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలకు రాలేదని, వరదల్లో సర్వం కోల్పోయిన కుటుంబాలను గాలికొదిలేశారని మండిపడ్డారు. గురువారం మంచిర్యాల జిల్లా హాజీపూర్​ మండలంలో నిర్వహించిన బీజేపీ భరోసా బైక్​ ర్యాలీకి వివేక్​ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్​రావుతో కలిసి వేంపల్లిలో జెండా ఆవిష్కరించి ర్యాలీని ప్రారంభించారు. జులైలో వరదలకు ఇండ్లు మునిగిన కుటుంబాలను ఆయన పరామర్శించారు. పలు గ్రామాల్లో ప్రజలనుద్దేశించి వివేక్​ మాట్లాడారు.

కుటుంబ పాలనతో జనం విసుగెత్తారు
కమీషన్ల కోసమే కేసీఆర్​ కాళేశ్వరం కట్టాడని, దాంతో రాష్ట్రానికి రూ.లక్ష కోట్ల నష్టం జరిగిందని వివేక్​ ఆరోపించారు. ఈ ప్రాజెక్టు ద్వారా కొత్తగా ఒక్క బొట్టు నీళ్లు ఇయ్యకుండానే రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం మోపారన్నారు. ఈ ప్రాజెక్టు కోసం తెచ్చిన అప్పులపై వడ్డీనే రూ.30 వేల కోట్లకు చేరిందని, రానున్న రోజుల్లో ఇది రాష్ట్రానికి పెద్ద గుదిబండలా మారనుందని అన్నారు. కేసీఆర్​కు దమ్ము, ధైర్యం ఉంటే కాళేశ్వరం, మిషన్​ భగీరథలో అవినీతిపై సీబీఐ ఎంక్వైరీకి సిద్ధం కావాలని సవాల్​ విసిరారు. అవినీతి సొమ్ముతో ఓట్లు కొని గెలుస్తానని కేసీఆర్ అనుకుంటున్నారని, కానీ టీఆర్ఎస్​ నిరంకుశ, కుటుంబ పాలనపై ప్రజలు విసుగెత్తిపోయారని అన్నారు. 

సమస్యలు తెలుసుకుంటూ.. భరోసానిస్తూ..
బీజేపీ భరోసా యాత్రలో వివేక్,​ రఘునాథ్​రావు ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, వారికి భరోసానిస్తూ ముందుకు సాగారు. వేంపల్లిలో గురువారం ఉదయం 11 గంటలకు మొదలైన యాత్ర రాత్రి 8 గంటలకు కర్ణమామిడిలో ముగిసింది. ముల్కల్ల, వాగొడ్డుపల్లి, గంగొడ్డుపల్లి, చందనాపూర్, నంనూర్, రాపల్లి, గుడిపేట, నర్సింగాపూర్, రాజేశ్వరపల్లి, హాజీపూర్, టీకనపల్లి, బుద్దిపల్లి, గొల్లపల్లి, పెద్దంపేట, దొనబండ, పడ్తనపల్లి, కొండపల్లి మీదుగా సాగింది. వివేక్​ వెంకటస్వామి స్వయంగా బైక్​ నడుపుతూ హుషారుగా ముందుకు సాగారు. గ్రామగ్రామానా బీజేపీ జెండా ఎగురవేశారు. పెద్దంపేట శివారులో పత్తి చేనులో పనులు చేస్తున్న మహిళా రైతులతో మాట్లాడారు. కల్లు మండువ వద్ద గౌడ కులస్తులతో ముచ్చటపెట్టారు. గుడిపేటలో రేషన్​ షాపులో బియ్యం పోశారు. పలువురికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. యాత్రలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శులు ముల్కల్ల మల్లారెడ్డి, పొనుగోటి రంగారావు, జిల్లా ప్రధాన కార్యదర్శులు అందుగుల శ్రీనివాస్, మునిమంద రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

టీఆర్ఎస్​ గ్రాఫ్ పడిపోతున్నది
ప్రధాని నరేంద్రమోడీ ప్రవేశపెట్టిన పథకాలతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి లబ్ధి జరుగుతోందని వివేక్​ చెప్పారు. తెలంగాణలో టీఆర్ఎస్​గ్రాఫ్​ వేగంగా పడిపోతూ బీజేపీ గ్రాఫ్​ పెరుగుతోందని, ఇప్పటికే బీజేపీకి 30 శాతానికిపైగా ఓటు బ్యాంక్​ ఉందని అన్నారు. పేదలకు ఫ్రీ రేషన్​ ఇస్తున్నందున రేషన్​ షాపుల్లో మోడీ ఫొటో పెట్టాలంటే.. కల్వకుంట్ల కవిత గ్యాస్​ సిలిండర్లపై ఆయన ఫొటో పెట్టాలనడం విడ్డూరంగా ఉందన్నారు. ఆ మాటకొస్తే మద్యం ధరలను విపరీతంగా పెంచినందుకు, ఢిల్లీ లిక్కర్​ స్కాంలో కూరుకుపోయినందుకు కేసీఆర్, కవిత ఫొటోలను లిక్కర్​ బాటిళ్లపై పెట్టాలని కామెంట్​ చేశారు. కేంద్రం ఇంధన ధరలను లీటర్​కు రూ.20 వరకు తగ్గించిందని, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పైసా తగ్గించకుండా ప్రజలపై భారం వేస్తోందన్నారు. టీఆర్ఎస్​ను ఓడించే సత్తా బీజేపీకే ఉందని, వచ్చే ఎన్నికల్లో కేసీఆర్​గద్దె దిగడం ఖాయమన్నారు.