అమిత్ షా సభ ఏర్పాట్లు పరిశీలించిన వివేక్, రాజగోపాల్ రెడ్డి

అమిత్ షా సభ ఏర్పాట్లు పరిశీలించిన వివేక్, రాజగోపాల్ రెడ్డి

ఆదివారం మునుగోడులో జరగనున్న అమిత్ షా సభకు బీజేపీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మునుగోడులో బహిరంగ సభ ప్రాంగణంతో పాటు పార్కింగ్ సౌకర్యాలు, హెలిప్యాడ్ ప్రాంతాలను బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక నేతలకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఇక ఈ సభకు భారీ జనాన్ని సమీకరించే పనిలో కమలం నేతలు నిమగ్నమయ్యారు.

ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ కు అమిత్ షా

ఈ నెల 21న తెలంగాణలో  కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. మునుగోడు బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. దీనికి సంబంధించి షెడ్యూల్ అధికారికంగా రిలీజ్ అయింది. ఈనెల‌ 21న మధ్యాహ్న 3.40 గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రానున్నారు. శంషాబాద్ నుంచి హెలికాప్టర్ లో సాయంత్రం 4.25 గంటలకు మునుగోడుకు వెళ్లనున్నారు. 4.35 నుంచి 4.50 వరకు సీఆర్పీఎఫ్ అధికారులతో రివ్యూ నిర్వహించనున్నారు.  సాయంత్రం 4.50గంల నుంచి 6గంటల వరకు మునుగోడు సభలో హోంమంత్రి పాల్గొననున్నారు. ఈ సభలోనే అమిత్ షా సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాషాయ కండువా కప్పుకోనున్నారు.

బహిరంగ సభ తర్వాత రామోజీ ఫిలిం సిటీ వెళ్లనున్నారు. 6.45 నుంచి 7.30 వరకు రామోజీ ఫిలిం సిటీలో ఉండనున్నారు.7.30కు అక్కడి నుంచి బయలుదేరి నోవాటెల్​ కు చేరుకుంటారు. నోవా టెల్​ లో పార్టీ ముఖ్యనేతలతో ఆయన సమావేశంకానున్నారు. మునుగోడు ఉప ఎన్నిక, రానున్న అసెంబ్లీ ఎన్నికల‌ నేపథ్యంలో రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. రాత్రి 9.40కి తిరిగి ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు.