కేసీఆర్ నియంత పాలనను అంతం చేస్తాం: వివేక్ వెంకటస్వామి

కేసీఆర్ నియంత పాలనను అంతం చేస్తాం: వివేక్ వెంకటస్వామి

కోల్​బెల్ట్, వెలుగు : రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తామని, బీఆర్ఎస్ పార్టీని గద్దెదింపుతామని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి ప్రకటించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి పూర్తి సమన్వయంతో పనిచేస్తామని.. చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు వివేక్ వెంకటస్వామి, గడ్డం వినోద్ లను గెలిపిస్తామన్నారు. మంగళవారం సాయంత్రం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సీపీఐ ఆఫీస్​లో ఏర్పాటు చేసిన సంయుక్త మీడియా సమావేశంలో వివేక్ వెంకటస్వామితో కలిసి చాడ వెంకట్ రెడ్డి మాట్లాడారు. 

కొత్తగూడెంలో సీపీఐ అభ్యర్థిని గెలిపించేందుకు కాంగ్రెస్ క్యాడర్ సహకరించాలని కోరారు. అనివార్య పరిస్థితుల్లో ఒకే స్థానంలో పోటీ చేస్తున్నామని చెప్పారు. ఇకపై ప్రజా సమస్యలపై రెండు పార్టీలు కలిసి పోరాటం చేస్తాయన్నారు. బీఆర్ఎస్ కు కాంగ్రెస్సే ప్రత్యామ్నాయమని స్పష్టం చేశారు. గతంలోనూ వివేక్ వెంకటస్వామితో కలిసి పనిచేశామన్నారు. కాళేశ్వరం నిర్మాణంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని చెన్నూరు, కోటపల్లి, జైపూర్ మండలాల ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. నాణ్యత లేకుండా ప్రాజెక్టును కట్టడంతో మూడేండ్లేకే బ్యారేజీ కుంగిపోతోందన్నారు.   

సీపీఐతో కాకాకు మంచి అనుబంధం 

కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామికి సీపీఐతో మంచి అనుబంధం ఉండేదని వివేక్ వెంకటస్వామి అన్నారు. అప్పట్లో తన తండ్రి కాకా గెలిచేందుకు సీపీఐ సహకరించిందని, ఇప్పుడు తనను గెలిపించేందుకు కూడా ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. 2009లో తాను ఎంపీగా గెలవడంలోనూ కమ్యూనిస్టులు సపోర్ట్ చేశారని గుర్తుచేసుకున్నారు. సీపీఐ పేద ప్రజలకు న్యాయం చేస్తుందన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ అవినీతి, నియంత పాలనను అంతం చేసేందుకు కలిసి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. అహంకారంతో వ్యవహరిస్తున్న బాల్క సుమన్, దుర్గం చిన్నయ్య, కేసీఆర్ లను ఈసారి ఇంటికి పంపేందుకు ప్రజలు కంకణం కట్టుకున్నారన్నారు. మీడియా సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యవదర్శివర్గ సభ్యుడు కలవేని శంకర్, జిల్లా సెక్రటరీ రామడుగు లక్ష్మణ్, జిల్లా కార్యవర్గ సభ్యుడు మేకల దాసు, నేతలు వాసిరెడ్డి సీతారామయ్య, ఎండీ.అక్బర్​అలీ, ఇప్పకాయల లింగయ్య,  మిట్టపల్లి వెంకటస్వామి, కాళీందర్, అలీఖాన్, సుదర్శనం, లింగం రవి, వీరభద్రయ్య, పూర్ణిమ, బాజీసైదా పాల్గొన్నారు. 

ధరణితో వందల ఎకరాలు లూటీ 

ధరణి పేరుతో వందల ఎకరాల భూములను సీఎం కేసీఆర్​తన ఖాతాలో వేసుకున్నరని, అసలు ఆ పోర్టల్ ను తెచ్చిందే ఆయన కుటుంబం కోసమని చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ వివేక్​వెంకటస్వామి ఫైర్ అయ్యారు. ‘‘నీలాగ పూటకో నియోజకర్గంలో పోటీ చేయలే. చచ్చినా, బతికినా.. ఎప్పటికీ నా కేరాఫ్ అడ్రస్ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోనే’’ అని స్పష్టం చేశారు. మంగళవారం మంచిర్యాల జిల్లా మందమర్రిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ చేసిన కామెంట్లపై వివేక్ ఒక ప్రకటనలో ఘాటుగా స్పందించారు. ఓడినా, గెలిచినా తాను ప్రజాపక్షమేనని పేర్కొన్నారు. కేసీఆర్ కుటుంబసభ్యులు అక్రమ ఇసుక దందాతో సూట్ కేసులు నింపుకున్నారని అన్నారు. ఎమ్మెల్యే బాల్క సుమన్.. కేసీఆర్ ఇంట్లో మనిషి కాదని, ఆయన బినామీ అని ఆరోపించారు. చెన్నూరులో రూ. వేల కోట్ల ఇసుక దోపిడీ కోసమే సుమన్ ను ఎమ్మెల్యే చేశారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చెన్నూరులో ఇసుకపై వచ్చే నిధుల్లో 50 శాతం ఫండ్స్ ను స్థానికంగానే అభివృద్ధిపనులకు ఖర్చు చేస్తామన్నారు.