కాళేశ్వరం రీడిజైన్ చేసి ముంచిండు

కాళేశ్వరం రీడిజైన్ చేసి ముంచిండు

కామారెడ్డి/పిట్లం, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు ఫెయిల్ అయిందని, ఇందుకు బాధ్యుడైన సీఎం కేసీఆర్ ను జైల్లో పెట్టాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్​ తానే చేశానని కేసీఆర్ చెప్పారు. రూ.లక్ష కోట్లతో ప్రాజెక్టు నిర్మిస్తే, ఒక్క ఎకరాకన్నా నీళ్లు అందలేదు. వరదలకు మోటార్లు మునిగిపోయాయి. ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తో ఊళ్లన్నీ మునిగాయి. ఇందుకు బాధ్యుడైన సీఎం కేసీఆర్​పై కేసు పెట్టాలి” అని అన్నారు. ప్రజా గోస బీజేపీ భరోసా ప్రోగ్రామ్ లో భాగంగా శుక్రవారం 9వ రోజు కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో వివేక్ పర్యటించారు. జుక్కల్, సిద్దాపూర్​, మైబాపూర్, గుండూర్, గుండూర్​ తండాల్లో ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘వరద బాధితులకు రూ.10 వేలు ఇస్తామన్న కేసీఆర్.. ఇప్పటి వరకు నిధులు విడుదల చేయలేదు. కాళేశ్వరం మోటార్లు వరదల్లో మునిగిపోతే, వాటి పరిస్థితి ఎలా ఉందో చూడకుండా ఢిల్లీకి వెళ్లారు. రూ.లక్ష కోట్లతో కాళేశ్వరం కట్టి, ప్రజా ధనం దుర్వినియోగం చేశారు. కాళేశ్వరంలో జరిగిన అవినీతి, అక్రమాలపై సీఎంపై కేసు పెట్టి విచారించాల్సిన అవసరం ఉంది” అని అన్నారు. రాష్ట్రంలో కేవలం మూడు నియోజకవర్గాల్లోనే అభివృద్ధి చేస్తున్నారని, మిగతా వాటిని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ‘‘సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్​నియోజకవర్గాల్లోనే అభివృద్ధి చేస్తున్నారు. సిరిసిల్లలో అయితే గల్లీగల్లీలో సీసీ రోడ్లు నిర్మించారు. జుక్కల్​లాంటి వెనకబడిన నియోజకవర్గంలో మాత్రం రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ఎందుకు అభివృద్ధి చేయడం లేదు” అని ప్రశ్నించారు. 

అడ్డుకునేందుకు టీఆర్ఎస్ ప్రయత్నం.. 

పల్లె గోస బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా జుక్కల్ మండలం సిద్దాపూర్​కు వివేక్, పార్టీ జిల్లా ప్రెసిడెంట్ అరుణతార, జిల్లా ఇన్​చార్జి మహిపాల్​రెడ్డి, నేతలు, కార్యకర్తలు వెళ్లారు. అక్కడ కొందరు టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు జోక్యం చేసుకొని టీఆర్ఎసోళ్లను పక్కకు పంపించారు. అనంతరం బీజేపీ లీడర్లు ఊర్లోకి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. పార్టీ జెండాను ఎగురవేశారు. 

ఇంటికో ఉద్యోగమేదీ? 

ఇంటికో ఉద్యోగమని చెప్పిన కేసీఆర్.. తన కొడుకు, బిడ్డ, అల్లుడు, బంధువులకే పదవులు ఇచ్చుకున్నారని వివేక్ మండిపడ్డారు. ఆ పదవులతో కేసీఆర్ కుటుంబానికి నెలకు రూ.30 లక్షల ఆదాయం వస్తోందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలన్నీ ఆయన కుటుంబానికే కావాలని విమర్శించారు. ఎన్నికలు రాగానే రూ.2,500 పింఛన్​ఇస్తే తనకే ఓటేస్తారనే భావనలో కేసీఆర్​ఉన్నారని... కానీ మన ఇంట్లో ఒకరికి ఉద్యోగం వస్తే రూ.20 వేల జీతం వస్తుందని, దీనిపై ప్రజలు ఆలోచించాలని సూచించారు. కేసీఆర్ ఒక్క హామీ నెరవేర్చలేదని ఫైర్ అయ్యారు. నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఏమయ్యాయని ప్రశ్నించారు.