నన్ను అరెస్టు చేసేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర: వివేక్ వెంకటస్వామి

నన్ను అరెస్టు చేసేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర: వివేక్ వెంకటస్వామి

తనను అరెస్టు చేసేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయని చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి అన్నారు. 2023, నవంబర్ 23వ తేదీ గురువారం ఉదయం మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం భీమారం మండలంలో వివేక్ వెంకటస్వామి  పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో  కొత్తపల్లి గ్రామానికి వెళ్లిన ఆయనకు మహిళలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ...  ఓటమి భయంతోనే తనపై ఈడీ, ఐటీ దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్, బీజేపీ కుట్రలతోనే తనపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. చట్టపరంగానే తన కుటుంబ వ్యాపార వ్యవహారాలు ఉన్నాయన్నారు. 

బీజేపీలో ఉన్నప్పుడు పార్టీ కోసం నిజాయితీగా పనిచేశానని... బీజేపీలో ఉన్నన్నీ రోజులు తనపై ఎలాంటి దాడులు జరగలేదని చెప్పారు. కాంగ్రెస్ లో చేరి గెలుస్తుండనగానే దాడులు చేయిస్తున్నారని..  ఎవరెన్ని కుట్రలు చేసినా చెన్నూరులో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పదేళ్లు ప్రజలను పట్టించుకోని బీఆర్ఎస్ ను వదిలించుకోవాలని... ఓటుకు రూ.5వేలు ఇచ్చేందుకు బాల్క సుమన్  ప్రయత్నిస్తున్నాడని ఆయన అన్నారు. 

బీజేపీలో ఉన్న సమయంలో పార్టీ కోసం ఎంతో హార్డ్  వర్క్ చేశానన్నారు. హుజూరాబాద్, మునుగోడు ఎన్నికల్లో పని చేసి అభ్యర్థుల గెలుపుకు కృషి చేశానని చెప్పారు.బాల్క సుమన్ చెప్పడంతోనే కేసీఆర్ అమిత్ షాకు ఫోన్  చేసి దాడులు చేయించిండని ఆగ్రహం వ్యక్తం చేశారు. 8 ప్రాంతాల్లో తనిఖీలు చేశారని.. అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానని వివేక్ తెలిపారు.

కేసీఆర్ నీ గతి ఏముండే.. 2014 ఎన్నికల్లో నీకు సహాయం చేశానని..  అలాంటిది నాపైనే తప్పుడు ఆరోపణలతో దాడులు చేయిస్తావా?... దమ్ముంటే ఎన్నికల్లో గెలువు అని సవాల్ విసిరారు. చట్టం ప్రకారం ఉన్న కాబట్టే.. కేసీఆర్ పై 4 సంవత్సరాలు నిరంతరం పోరాటం చేశానని చెప్పారు. బీజేపీ, కేసీఆర్ ఒకటే.. అందుకే కాంగ్రెస్ లోకి వచ్చానని అన్నారు. బీజేపీకి పని చేస్తే బీఆర్ఎస్ కి చేసినట్టేన్నారు.

బీజేపీలో నేను ఉంటే అప్పుడు సీతను, కాంగ్రెస్ లోకి వచ్చిన కాబట్టి రావణుడిలా మీద పడుతున్నారని దుయ్యబట్టారు. హుజూరాబాద్ ఎన్నికల సమయంలో ఈటెల రాజేందర్ కు రూ. 27 కోట్లు ఇచ్చానని.. అవ్వని చట్టం ప్రకారం చెక్స్ ఇచ్చానని చెప్పారు. ఈటెల భూముల కోసమే రూ.27 కోట్లు ఇచ్చానని.. ఆ భూముల వ్యవహారంలో నాకు ఇప్పుడు నోటీసులు ఇచ్చారని మండిపడ్డారు. ఈటెల రాజేందర్ ను ఎందుకు పిలువరని.. ఆయన బీజేపీలో ఉన్నాడని.. ఆయనకు ఎలాంటి నోటిసులు ఇవ్వలేదని చెప్పారు. రూ.200 వందల కోట్ల అక్రమ లావాదేవీలు జరిగాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు.

వార్తల్లో రాసిన కంపెనీ నా మిత్రుడు యశ్వంత్ రెడ్డికి చెందిందని..  అతను అమెరికాలో ఉంటున్నాడని.. చట్టంలోని నిబంధన ప్రకారం నా స్నేహితుని సంస్థను చూసుకుంటున్నానని చెప్పారు. మొన్నే కంపెనీ షేర్లు అమ్మితే రూ.50 కోట్లు లాభం వచ్చిందని.. రూ. 9 కోట్లు పన్నుగా చెల్లించామని తలిపారు. ప్రభుత్వానికి చెల్లించిన రూ.9 కోట్ల పన్ను వ్యవహారంలో ఎక్కడ కూడా అధికారులు బయటికి చేప్పలేదని ఆయన అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ, అమిత్ షా కుట్ర చేసి.. నన్ను అరెస్టు చేసినా ప్రజలే గెలిపిస్తారని వివేక్ అన్నారు.