మీ నాన్న సీఎం అయ్యిండు.. నువ్వు మంత్రివైనవ్
కేటీఆర్ కామెంట్లపై వివేక్ వెంకటస్వామి ఫైర్
అమరుల త్యాగాలు, అందరి పోరాటంతోనే రాష్ట్రం ఏర్పడింది
జాతీయ పార్టీలు రాష్ట్ర అధ్యక్షులను ఏర్పాటు చేసుకుంటాయని తెలియదా?.. కనీస అవగాహన లేకుండా మాట్లాడకు
ఉద్యమ టైంలో చెప్పింది ఏమిటి.. ఇప్పుడు చేస్తున్నది ఏమిటి?
తొలి సీఎం దళితుడే అన్నది నిజం కాదా?
నీళ్లను ఏపీ దోచుకుపోతుంటే ఏం చేస్తున్నరు?
లక్షా 91 వేల ఖాళీలను ఎందుకు భర్తీ చేయట్లే
ప్రజలను నమ్మించి మోసం చేశారని ఆగ్రహం
హైదరాబాద్, వెలుగు: ‘‘అమరుల త్యాగాలు, ప్రజల పోరాటం ఫలితంగా రాష్ట్రం ఏర్పాడటంతోనే మీ నాన్న సీఎం అయ్యిండు.. నువ్వు మంత్రివి అయినవ్.. గుర్తుంచుకో” అని మంత్రి కేటీఆర్‌పై బీజేపీ కోర్ కమిటీ మెంబర్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఫైర్ అయ్యారు. ఇద్దరు ఎంపీలున్న టీఆర్ఎస్ తో తెలంగాణ రాలేదని, పార్టీలకతీతంగా ఎంపీలంతా పోరాడితేనే వచ్చిందన్నారు. నాడు లోక్ సభ నుంచి ఎంపీలు సస్పెండ్ అయినప్పుడు కేసీఆర్ కనీసం సభలో కూడా లేరని గుర్తుచేశారు. కేసీఆర్ వల్లే ప్రతిపక్ష పార్టీల నేతలకు పదవులు వచ్చాయంటూ మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్లపై వివేక్ వెంకటస్వామి శుక్రవారం ఒక ప్రకటనలో ఘాటుగా స్పందించారు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ నేతలకు పదవులే లేవని మాట్లాడటం అహంకారానికి నిదర్శనమన్నారు. ‘‘కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు అన్ని జాతీయ పార్టీలు రాష్ట్ర శాఖలను ఏర్పాటు చేసుకుంటాయి. రాష్ట్ర అధ్యక్షులను అపాయింట్ చేసుకుంటాయి. దీనిపై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నరు” అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ బిల్లు పెడితే, బీజేపీ మద్దతిస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందనే విషయం కేటీఆర్ గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల పోరాటం, ఉద్యమ ఫలితాలను కేసీఆర్ ఫ్యామిలీ స్వార్థ ప్రయోజనాలకు తాకట్టు పెడుతోందని, పోరాటంలో ముందున్న స్టూడెంట్ల త్యాగాలను తక్కువ చేసి చూపిస్తున్నారని మండిపడ్డారు.
ఉద్యమ టైంలో చెప్పిందేంది? ఇప్పుడు చేస్తుందేది?
రాష్ట్రం కోసం 1,200 మంది బలిదానాలు చేశారని పదే పదే చెప్పిన కేసీఆర్.. అధికారంలోకి వచ్చాక అమరుల కుటుంబాలను మరిచిపోయారని వివేక్ అన్నారు. 459 మంది అమరుల కుటుంబాలకే ఎక్స్ గ్రేషియా ఇచ్చి, మిగతా వారిని పట్టించుకోలేదని మండిపడ్డారు. ఉద్యమం టైమ్‌లో కల్లబొల్లి మాటలు చెప్పి పవర్ లోకి వచ్చిన తర్వాత అసలైన ఉద్యమకారులను పక్కన పెట్టారన్నారు. త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణకు దళితుడే తొలి సీఎం అని చెప్పిన కేసీఆర్.. రాష్ట్రం ఏర్పడగానే మోసం చేసి సీఎం అయ్యారని, గత ఏడేండ్లలో రాష్ట్రంలో ఎక్కువ లాభపడ్డది కల్వకుంట్ల కుటుంబమేనని చెప్పారు. సొంత రాష్ట్రంలో ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ ఎజెండాగా చెప్పిన కేసీఆర్.. నీళ్లను ఏపీ దోపిడీ చేస్తున్నా పట్టించుకోవట్లేదని విమర్శించారు. కొత్త ప్రాజెక్టులు, ప్రగతి భవన్, కొత్త సెక్రటేరియట్ అంటూ ప్రజాధనాన్ని విచ్చలవిడిగా కాంట్రాక్టర్లకు పంచిపెడుతున్నారన్నారు. పీఆర్సీ కమిషన్ లక్షా 91 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు పేర్కొందని, వాటిని ఎందుకు భర్తీ చేయట్లేదని ప్రశ్నించారు.
