ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

రానున్నది బీజేపీ ప్రభుత్వమే

బెల్లంపల్లి,వెలుగు: రాష్ట్రంలో కేసీఆర్​ పాలనపై ప్రజలు విసుగు చెందారని.. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, పెద్దపల్లి మాజీ ఎంపీ గడ్డం వివేక్ వెంకటస్వామి చెప్పారు. వచ్చే పదేళ్లలో భారత దేశం అభివృద్ధిలో ప్రపంచంలోనే టాప్ గా నిలుస్తుందన్నారు. బుధవారం రాత్రి హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో స్థానిక సింగరేణి తిలక్ స్టేడియంలో నిర్వహించిన విజయదశమి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. రాం లీలా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మున్సిపల్ చైర్​పర్సన్ ​జక్కుల శ్వేతతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ అంబేద్కర్ దేశ ప్రజలంతా కలిసి ఉండాలని సూచించారన్నారు. ఎమ్మెల్యే చిన్నయ్య మాట్లాడుతూ ఆకలి ఆత్మ హత్యలు, వలసలు లేని దేశం కావాలన్నారు. కార్యక్రమంలో  బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేశ్, జడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మునిమంద రమేశ్, జిల్లా అధికార ప్రతినిధి బొమ్మెన హరీశ్​గౌడ్,  హిందూ ఉత్సవ సమితి సభ్యులు నగేశ్, కోడి రమేశ్, రాచర్ల సంతోష్, బాల సంతోష్, కొడిప్యాక విద్యాసాగర్, పూదరి సత్యనారాయణ, అడప నాగరాజు, సరస్వతి శిశు మందిర్ పూర్వవిద్యార్థి పరిషత్ రాష్ట్ర కార్యదర్శి బొడ్డు శ్రీనివాస్ పాల్గొన్నారు.

బీజేపీలో పలువురి చేరిక..

బెల్లంపల్లిలో రాత్రి బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మునిమంద రమేశ్​ ఇంట్లో ఏర్పాటు చేసిన చేరికల కార్యక్రమానికి వివేక్ ​హాజరయ్యారు. కన్నెపల్లి మండల కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీటీసీ ఎం.మంగయ్య, నెన్నెల మండలం కాంగ్రెస్ నేత కోట రాయలింగు సహా 30 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మునిమంద రమేశ్​ ఆధ్వర్యంలో వివేక్ వెంకటస్వామి సమక్షంలో బీజేపీలో చేరారు. వారికి వివేక్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర, జిల్లా, పట్టణ నాయకులు బొమ్మెన హరీశ్, రేవెల్లి రాజలింగు, సబ్బని రాజనర్సు, కోయిల్కార్ గోవర్దన్, ఎర్కకల శ్రీనివాస్, దూడపాక బలరాం, గోలి శ్రీనివాస్, బాల్మీకి సునీల్, విజయ్ కుమార్, ఎర్కల నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.

బీఆర్ఎస్ తో  దేశంలో విప్లవాత్మక మార్పు

బోథ్,వెలుగు: బీఆర్ఎస్ తో దేశంలో విప్లవాత్మక మార్పు రానుందని మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి చెప్పారు. ధన్నూరు వేంకటేశ్వర ఆలయం నుంచి కండి పల్లె వరకు రూ.6.52 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులను గురువారం ఆయన ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం సీఎం కేసీఆర్​ఫొటోకు క్షీరాభిషేకం చేశారు. తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. బీఆర్ఎస్ కేంద్రంలో అధికారంలోకి రాగానే తెలంగాణ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ తులా శ్రీనివాస్, జడ్పీటీసీ సంధ్యారాణి, సర్పంచ్ గంగాధర్, ఎంపీటీసీ నారాయణ రెడ్డి, జడ్పీ కో ఆప్షన్​మెంబర్ తాహెర్ బిన్ సలామ్, మార్కెట్ కమిటీ చైర్మన్ భోజన్న, లీడర్​చట్ల ఉమేశ్​ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ‘కాకా’ జయంతి 

రామకృష్ణాపూర్​,వెలుగు: కేంద్ర మాజీ మంత్రి, తొలితరం తెలంగాణ పోరాట యోధులు గడ్డం వెంకటస్వామి(కాకా) 93వ జయంతిని ఘనంగా నిర్వహించారు. బుధవారం సాయంత్రం క్యాతనపల్లి మున్సిపాలిటీలోని తిమ్మాపూర్​ ఫేడ్​  వృద్ధాశ్రమంలో బీజేపీ ఆధ్వర్యంలో పండ్లు, బ్రెడ్​పంపిణీ చేశారు. కార్యక్రమానికి పెద్దపల్లి మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు డాక్టర్​ వివేక్​వెంకటస్వామి చీఫ్​గెస్ట్​గా హాజరయ్యారు. వృద్ధులు, అనాథలకు పండ్లు, బ్రెడ్, బిస్కెట్లు, గుడ్లు పంపిణీ చేశారు. షేడ్ ​సంస్థ నిర్వాహకులు అందిస్తున్న సేవలను కొనియాడారు. వృద్ధులకు  తనవంతు సహకారం ఎల్లప్పుడు  ఉంటుందని పేర్కొన్నారు. ఆయన వెంట చెన్నూరు నియోజకవర్గ ఇన్​చార్జి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అందుగుల శ్రీనివాస్, పెద్దపల్లి నియోజకవర్గ లీడర్ గొట్టెముక్కల సురేశ్​రెడ్డి, చెన్నూరు నియోజకవర్గ కన్వీనర్ అక్కల రమేశ్, రామకృష్ణాపూర్ టౌన్​ ప్రెసిడెంట్ మహంకాళి శ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధి బొమ్మన హరీశ్​గౌడ్,  బీజేవైఎం నియోజకవర్గ కన్వీనర్ అందుగుల రవీందర్, లీడర్లు వైద్య శ్రీనివాస్, దార రవిసాగర్ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు ‘వెలుగు దినపత్రిక’ నాలుగో వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని పత్రిక చైర్మన్, మాజీ ఎంపీ డాక్టర్ వివేక్​ వెంకటస్వామిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్​వెరబెల్లి, ప్రధానకార్యదర్శి అందుగుల శ్రీనివాస్ , రామకృష్ణాపూర్​టౌన్​ ప్రెసిడెంట్​మహంకాళీ శ్రీనివాస్, బీఎంఎస్ మందమర్రి ఏరియా వైస్  ప్రెసిడెంట్ డొనికేన రమేశ్​గౌడ్,  వైద్య శ్రీనివాస్​ తదితరులు ఘనంగా సన్మానించారు. 

రామకృష్ణాపూర్​లో సరుకుల పంపిణీ...

బీజేపీ టౌన్​ ప్రెసిడెంట్​ మహంకాళి శ్రీనివాస్​ ఆధ్వర్యంలో కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి(కాకా) జయంతి రామకృష్ణాపూర్​లోని అబ్రహంనగర్​లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ‘కాకా’ ఫొటోకు పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం పేదలకు బియ్యం, సరుకులు అందజేశారు. సింగరేణిని కాపాడిన మహనీయుడు ‘కాకా’ అని మహంకాళి శ్రీనివాస్​కొనియాడారు. కార్మికులకు పెన్షన్ విధానం తీసుకవచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం, దళితుల బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశారన్నారు. వెంకటస్వామి తనయుడు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి కృషితో  రవీంద్రఖని రైల్వే స్టేషన్​లో తెలంగాణ(కాగజ్​నగర్​), ఇంటర్​సిటీ ఎక్స్​ప్రెస్​ రైళ్లకు హాల్టింగ్​ లభించిందన్నారు. క్యాతనపల్లి రైల్వే గేట్ వద్ద ఫ్లైఓవర్ కోసం ఫండ్స్​ మంజూరు చేశారన్నారు. విశాక ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తూ పేదలకు అండగా నిలుస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో రామకృష్ణాపూర్ పట్టణ బీసీ మోర్చా ప్రెసిడెంట్​ వీరమల్ల పాల రాజయ్య, బీజేవైఎం జనరల్​సెక్రటరీ బద్రీ సతీశ్, ఎస్సీ మోర్చా జనరల్ సెక్రటరీ దొంతమల్ల శ్యాం, మహిళా మోర్చా ప్రెసిడెంట్ మేదరి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

సీహెచ్​పీని తనిఖీ చేసిన డీజీఎంఎస్​ ఆఫీసర్లు

నస్పూర్,వెలుగు: శ్రీరాంపూర్ ఏరియా నూతన సీహెచ్ పీని గురువారం డైరెక్టర్ జనరల్ మైన్ సేఫ్టీ (డీజీఎంఎస్) ఆఫీసర్లు తనిఖీ చేశారు. డీజీఎంఎస్ డైరెక్టర్ మైన్ సేఫ్టీ( మెకానికల్) ఎస్. రత్నాకర్ కొత్త సీహెచ్​పీ పనితీరు పరిశీలించారు. అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు తీసుకుంటున్న చర్యలు తెలుసుకున్నారు. సీహెచ్ పీ ఆఫీసర్లకు సూచనలు చేశారు. అనంతరం ప్రాంగణంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో శ్రీరాంపూర్ ఏరియా ఇంజినీర్ చంద్రశేఖర్ రెడ్డి, ఆర్కే5, సీహెచ్​పీ ఎస్​వోఎం అబ్దుల్ ఖదీర్, డీజీఎం వెంకటేశ్వర్ రావు, ఎస్ఈ బసవరావు,  ఆఫీసర్లు తిరుపతి రెడ్డి, సతీశ్​కుమార్  తదితరులు పాల్గొన్నారు.

రావణ దహనంపై దళిత సంఘాల నిరసన 

బెల్లంపల్లి,వెలుగు: విజయదశమి ఉత్సవాల్లో భాగంగా బెల్లంపల్లిలో రావణాసురుని సంహరణకు వ్యతిరేకంగా గురువారం దళితులు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట  నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. రావణుని ఫొటోకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా దళిత సంఘాల లీడర్లు చిలుక రాజనర్సు, కాసర్ల యాదగిరి, గొడిసెల శ్రీహరి మాట్లాడారు. దేశ మూలవాసి ద్రావిడ  రాజు రావణ బొమ్మను తగులబెట్టిన వారిలో అగ్రవర్ణాల వారు లేరన్నారు. ఎస్సీ, బీసీలతో రావణ బొమ్మను తగుల బెట్టించారని విమర్శించారు. మనతోనే మన చరిత్రను తగుల బెట్టించడం దారుణమన్నారు. కార్యక్రమంలో లీడర్లు ఎల్తూరి శంకర్, గంగారపు రమేశ్, రంగ ప్రశాంత్,  లింగంపెల్లి రాజన్న, ప్రసాద్, నవీన్, రామకృష్ణ, సురేశ్, బానయ్య, రాజయ్య, నర్సయ్య, దుర్గయ్య, కె.శంకర్ తదితరులు పాల్గొన్నారు.