
చెన్నూరు/పెద్దపల్లి/ధర్మపురి, వెలుగు: పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు ఇస్తామని చెప్తూనే.. వారిపై అక్రమంగా కేసులు పెట్టిస్తూ కేసీఆర్ మోసం చేస్తున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ డాక్టర్ వివేక్ వెంకటస్వామి ఫైర్ అయ్యారు. తిరగబడిన రైతులపై ఫారెస్ట్ అధికారుల ద్వారా రకరకాల కేసులు పెట్టించి జైలుకు పంపుతూ సీఎం పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం అక్కెపెల్లి గ్రామంలో ఇటీవల జైలుకెళ్లొచ్చిన పోడు భూముల రైతులను వివేక్ సోమవారం కలిశారు. తర్వాత మీడియాతో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వాల పాలనలో పోడు రైతులపై కేసులే లేవన్నారు. ఒక్క అక్కెపెల్లిలోనే 19 మందిపై అక్రమ కేసులు పెట్టారన్నారు. అక్రమ కేసులు ఎత్తివేసి, పోడు భూములకు పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వాలిచ్చిన భూములను కేసీఆర్ సర్కార్ గుంజుకుంటోందని మండిపడ్డారు. ప్రజలు బీజేపీకి ఓటేసి గెలిపిస్తే అండగా ఉంటామన్నారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజల సంపదను కేసీఆర్ కుటుం బమే దోచుకుంటోందని ఆరోపించారు. కేసీఆర్‌ను గద్దెదింపేందుకు అందరూ కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు అందుగుల శ్రీనివాస్, వెంకటేశ్వర్ గౌడ్, రమేశ్, సుశీల్ కుమార్, చింతల శ్రీనివాస్, శంకర్, రఘునందన్ రెడ్డి, రాజు, శివకృష్ణ, శ్రీకాంత్, సంతోష్, ప్రవీణ్ నాయక్, ప్రవీణ్, వేల్పుల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో కేసీఆర్ నియంతృత్వ పాలన
రాష్ట్రంలో కేసీఆర్ నియంతృత్వ, రాక్షస పాలన సాగుతోందని వివేక్ ఫైర్ అయ్యారు. సోమవారం జగిత్యాల జిల్లా ధర్మ పురి పట్టణంలోని నంది చౌరస్తాలో బీజేపీ ‘సేవ, సుపరిపాలన, గరీబ్ కళ్యాణ్’ బహిరంగ సభలో మాట్లాడారు. కేంద్రంలో ప్రధాని మోదీ ప్రభుత్వం అధికారంలోకొచ్చి 9 ఏండ్లు అయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు. దేశంలో పేదలకు 4 కోట్ల ఇండ్లు కట్టించిన ఘనత ప్రధాని మోదీ సర్కారుదే అని చెప్పారు. కేసీఆర్, బిడ్డ, కొడుకు, అల్లుడు ఫామ్ హౌస్‌లు కట్టుకుని లక్ష కోట్ల కమీషన్లు మింగారని ఆరోపించారు. ప్రశ్నించే వాళ్లపై అక్రమ కేసులు పెడుతున్నారని, రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు సత్యనారాయణ రావు, కాడే సూర్యనారాయణ, కస్తూరి సత్యం, ఓరగంటి చంద్రశేఖర్, మంచే రాజేశ్, గాజుల మల్లేశం, పిల్లి శ్రీనివాస్, భాస్కర్, లవన్, తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర పథకాలను వివరించాలె..
మోదీ ప్రవేశపెట్టిన స్కీమ్స్ ప్రతి గడపకూ తీసుకెళ్లాలని కార్యకర్తలకు వివేక్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్, కేసీఆర్ చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించాలని చెప్పారు. సోమవారం పెద్దపల్లి జిల్లా మంథనిలో బీజేపీ సంయుక్త మోర్చాల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం నుంచి రైతులకు ఎన్నో సబ్సిడీలు ఉన్నాయని, కానీ వాటిని మన రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ అమలు చేయడంలేదన్నారు. పక్కన ఉన్న కర్నాటక కన్నా మన రాష్ట్రంలోనే పెట్రోల్ రేట్లు ఎక్కువగా ఉన్నాయన్నారు. కాళేశ్వరం ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్టు అని, దాని వల్ల ప్రాజెక్టు పరివాహ గ్రామాలన్నీ మునిగిపోతున్నాయన్నారు. ఈ ప్రాజెక్టు రీడిజైన్ వల్ల జరుగుతున్న నష్టాలను ప్రజలకు వివరించాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు రావుల రాజేందర్, చందుపట్ల సునీల్‌రెడ్డి, జి. అరుణ్ కుమార్, మల్లికార్జున్, సదాశివ్, బూడిద తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.