అహంకార ప్రభుత్వాలను కూల్చేశారు : వివేక్‌‌‌‌ వెంకటస్వామి

అహంకార ప్రభుత్వాలను కూల్చేశారు : వివేక్‌‌‌‌ వెంకటస్వామి
  •     కేసీఆర్, జగన్‌‌‌‌కు ప్రజలు గుణపాఠం చెప్పారు: వివేక్‌‌‌‌ వెంకటస్వామి
  •     కేంద్రంలో బీజేపీకీ స్పష్టమైన మోజారిటీ ఇవ్వలె
  •     ప్రజస్వామ్యాన్ని కాపాడేందుకే ప్రజలు వీరిని ఓడగొట్టారని వెల్లడి
  •     మంచిర్యాలలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌‌‌‌ చెక్కులు పంపిణీ చేసిన చెన్నూరు ఎమ్మెల్యే

కోల్​బెల్ట్, వెలుగు: అహంకారంతో వ్యవహరించే ప్రభుత్వాలను ప్రజలు సహించరని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి అన్నారు. అహంకార పాలన సాగించిన కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను తెలంగాణలో, జగన్‌‌‌‌మోహన్‌‌‌‌ రెడ్డిని ఏపీలో ప్రజలు ఓడగొట్టి గుణపాఠం చెప్పారన్నారు. సోమవారం మంచిర్యాల జిల్లా భీమారం రైతు వేదికలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. 

ఈ సందర్భంగా వివేక్‌‌‌‌ మాట్లాడుతూ.. అహంకార ధోరణితో వ్యహరించే ప్రభుత్వాలకు ప్రజల చేతిలో ఓటమి తప్పదన్నారు. కేసీఆర్, జగన్‌‌‌‌తో పాటు కేంద్రంలోని మోదీ సర్కార్‌‌‌‌‌‌‌‌కు కూడా కనీస మోజార్టీ ఇవ్వకుండా ప్రజలు తగిన బుద్ధి చెప్పారని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే ఇలాంటి ప్రభుత్వాలను ఓడగొట్టారన్నారు. 400 ఎంపీ సీట్లు వస్తాయని అహంకారంతో ఉన్న మోదీకి కేవలం 240 సీట్లు ఇచ్చారని తెలిపారు. ఇప్పుడు టీడీపీ చీఫ్‌‌‌‌ చంద్రబాబు, జేడీయూ చీఫ్ నితీశ్​కుమార్‌‌‌‌‌‌‌‌తో పాటు ఇతర మిత్ర పక్షాలపై ఆధారపడేలా ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు.

తన పేరు చెప్పి దందాలు చేస్తే సహించను..

తన పేరు చెప్పి ఎవరైనా భూ, ఇసుక, బియ్యం దందాలు చేస్తే సహించేది లేదని వివేక్‌‌‌‌ హెచ్చరించారు. ఎక్కడో ఒక చోట ఎవరో తప్పు చేస్తే తనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదన్నారు. అక్రమ దందాలు చేస్తే ఎంతటివారినైనా వదిలిపెట్టొద్దని, చర్యలు తీసుకోవాలని పోలీసులు, రెవెన్యూ, అన్ని శాఖల అధికారులను ఆదేశించామని వెల్లడించారు. రాష్ట్రంలో ప్రజా పాలన వచ్చిందని, ప్రజల కోసం మంచి పనులు చేస్తామని చెప్పారు. మిషన్ భగీరథ స్కీం అట్టర్ ప్లాప్ అని, దేశంలోనే ఇదో పెద్ద స్కామ్ అని, ఇందులో వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. చెన్నూరు నియోజకవర్గంలో వేసవిలో తాగు నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తుగా వంద బోర్లు వేయించామని గుర్తుచేశారు. తనను ఎమ్మెల్యేగా, తన కొడుకు వంశీకృష్ణను పెద్దపల్లి ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు, కాంగ్రెస్ శ్రేణులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు కోరుకున్న అభివృద్ధిని చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. ఈ సమావేశంలో జైపూర్ తహసీల్దార్ సదానందం, స్థానిక కాంగ్రెస్ లీడర్లు పాల్గొన్నారు.

ఐదు గ్యారంటీలను అమలు చేసినం..

కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల్లో ఐదింటిని అమలు చేసిందని, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్సేనని వివేక్‌‌‌‌ వెంకటస్వామి అన్నారు. ఫ్రీ బస్ వల్ల ఆర్టీసీ నష్టపోతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్టీసీ సేవలు మరింత మెరుగ్గా అందించేందుకు ఎక్కువ బస్సులు నడిపించాలని, కొత్త బస్సులు వేయాలని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌ను కోరానని తెలిపారు. మంచిర్యాల జిల్లాకు త్వరలో కొత్త బస్సులు వస్తాయని చెప్పారు. పేదల మీద వైద్య ఖర్చుల భారం పడకుండా రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచినట్లు, కొత్తగా మరో 59 వ్యాధులను ఆరోగ్యశ్రీలో చేర్చినట్టు చెప్పారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు ఎల్‌‌‌‌వోసీ ద్వారా నిమ్స్‌‌‌‌లో చికిత్స జరిగేలా డాక్టర్లతో మాట్లాడుతున్నామని తెలిపారు. ఇండ్లు లేని నిరుపేదలకు త్వరలో ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ చేస్తామని, ఇప్పటికే నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరయ్యాయని చెప్పారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయిన అభివృద్ధి పనులను స్పీడప్ చేస్తామని తెలిపారు.