చెన్నూరును మరింత అభివృద్ధి చేస్తం: వివేక్ వెంకటస్వామి

చెన్నూరును మరింత అభివృద్ధి చేస్తం: వివేక్ వెంకటస్వామి
  • మంచినీళ్లు, రోడ్లు, డ్రైనేజీలకు ఫస్ట్​ ప్రయారిటీ: ఎమ్మెల్యే వివేక్​ 
  • మౌలిక వసతులకు 4 కోట్లు మంజూరు చేస్తానని వెల్లడి
  • పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి

కోల్​బెల్ట్, వెలుగు: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సహకారంతో చెన్నూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి అన్నారు. ఎంపీ ఫండ్స్​తో నియోజకవర్గంలోని పట్టణాలు, గ్రామాల్లో మంచినీళ్ల సౌలత్, రోడ్లు, డ్రైనేజీల ఏర్పాటుకు ఫస్ట్​ ప్రయారిటీ ఇస్తామని చెప్పారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా మందమర్రిలో కొత్తగా రూ.22.90 కోట్ల నిధులతో నిర్మించిన రైల్వే ఓవర్​ బ్రిడ్జి, రోడ్డుతో పాటు పలు అభివృద్ధి పనులను ఎంపీ వంశీకృష్ణ, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్​కుమార్​తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మందమర్రిలో ఆర్వోబీని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. 

దీని వల్ల రవాణా వ్యవస్థ మరింత మెరుగవుతుందని చెప్పారు. ఆర్వోబీపై సత్వరమే సెంట్రల్​లైటింగ్​ఏర్పాటు చేయాలని ఆర్​అండ్​బీ అధికారులను ఆదేశించారు. మందమర్రి మున్సిపాలిటీ అభివృద్ధికి ఇప్పటికే రూ.2 కోట్ల ఫండ్స్​ను కేటాయించానని, త్వరలో మరో రూ.4 కోట్లు మంజూరు చేస్తానని తెలిపారు. చెన్నూరు నియోజకవర్గంలో విద్యుత్ సప్లై అస్తవ్యస్తంగా ఉందని ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి అన్నారు. పదేండ్లు ఆ​డిపార్ట్​మెంట్​నుంచి ఎలాంటి ఫండ్స్​ కేటాయించలేదన్నారు. కాగా, కొత్తగా 133 కేవీ సబ్​స్టేషన్​ మంజూరు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. రాష్ట్రంలో ముదిరాజ్​కులస్తులది అతిపెద్ద కమ్యూనిటీ అని ఎమ్మెల్యే వివేక్​ పేర్కొన్నారు. వారు చాలా వెనుకబడి ఉన్నారని, వారి అభ్యున్నతికి అన్ని విధాలా సహకరిస్తానని తెలిపారు. 

ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతాం: ఎంపీ వంశీకృష్ణ

లోక్​సభ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చుతామని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఎంపీ అయిన తర్వాత మొదటిసారి మందమర్రిలో ఆర్వోబీని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. పదేండ్లుగా క్యాతనపల్లి ఆర్వోబీ పనులు పూర్తిచేయలేదని, ప్రజలు ఇబ్బందులను దూరం చేసేందుకు వెంటనే నిర్మాణపనులు పూర్తి చేయాలని ఆర్​అండ్​బీ అధికారులను ఎంపీ ఆదేశించారు. ప్రజల సేఫ్టీ, సౌకర్యాలకు అవసరమైన ఎంపీ ఫండ్స్​ను కేటాయిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా సీఎం రేవంత్​రెడ్డి సుస్థిరమైన పాలన అందిస్తున్నారని, ప్రభుత్వ పథకాలను అర్హులందరికీ అందించేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్​ చైర్మన్​ మూల రాజిరెడ్డి, అధికారులు, కాంగ్రెస్​ లీడర్లు పాల్గొన్నారు.