సీఎం సభతోనే కరోనా పెరిగింది

సీఎం సభతోనే కరోనా పెరిగింది
  • v6-వెలుగుతో వివేక్ వెంకట స్వామి
  •    అందరూ వద్దంటున్నా సాగర్​లో సభ పెట్టారు
  •    సర్కారు నిర్లక్ష్యం వల్లే ఒక్కరోజులో 10 వేల కేసులు
  •    ప్రధాని లాగా సీఎం కూడా వ్యాక్సిన్​ వేసుకుంటే జనాల్లో భరోసా పెరిగేది
  •    మున్సిపల్​ ఎన్నికలను వాయిదా వేస్తే బాగుండేదని కామెంట్​

కరోనా కట్టడిలో రాష్ట్ర సర్కార్​ నిర్లక్ష్యం వల్లే కేసులు ఒక్కరోజులోనే 10 వేలు దాటాయని, సీఎం సాగర్​ సభతోనే కరోనా తీవ్రత పెరిగిందని మాజీ ఎంపీ, బీజేపీ కోర్​ కమిటీ సభ్యుడు వివేక్​ వెంకటస్వామి ఆరోపించారు. సీఎం కేసీఆర్​కు ప్రజలపై పట్టింపు లేదని, ధ్యాసంతా ఎన్నికలు, గెలుపుపైనేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.  మంగళవారం ‘వీ6 –వెలుగు’తో ఆయన పలు విషయాలపై మాట్లాడారు. ఐసోలేషన్​ తర్వాత సీఎం కేసీఆర్​ ఫాం హౌస్​ నుంచి బయటకు రావాలని, ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకోవాలని సూచించారు. అన్ని జిల్లా దవాఖాన్లను ముందే అప్​గ్రేడ్​ చేసి ఉంటే.. రాష్ట్రంలో ఈ పరిస్థితులు వచ్చేవి కాదన్నారు. డాక్టర్లు, నర్సుల నియామకాలను ముందే చేపట్టి ఉంటే ఉపయోగంగా ఉండేదన్నారు. వాటిని పట్టించుకోకుండా సర్కార్​ నిర్లక్ష్యం చేసిందని ఫైర్​ అయ్యారు. 

కేంద్రానికి తప్పుడు లెక్కలు
కరోనా కేసులు, మరణాలపై కేంద్రానికి రాష్ట్ర సర్కార్​ తప్పుడు లెక్కలు చెప్తోందని వివేక్​ వెంకటస్వామి విమర్శించారు. కరెక్ట్​ లెక్కలు పంపితే దానికి తగ్గట్టు సాయం అందుతుందన్నారు. ఆక్సిజన్​ లేదంటూ మంత్రులు కేటీఆర్​, ఈట రాజేందర్​ గగ్గోలు పెట్టారని, తర్వాతి రోజే ఒడిశా నుంచి ప్రధాని ట్యాంకర్లు తెప్పించారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే కరోనా కట్టడిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఎన్ని బెడ్లున్నాయి.. వెంటిలేటర్లు ఎన్ని ఉన్నాయి.. ఆక్సిజన్​ కొరత ఎంతుంది.. వంటి వివరాలపై సీఎం కేసీఆర్​ ఒక్కసారైనా రివ్యూ పెట్టలేదని మండిపడ్డారు. 
  
ఎవరూ ఊహించలె
కరోనా కట్టడికి రెమ్డెసివిర్​ పరిష్కారం కాదని, అది యాంటీ వైరల్​ డ్రగ్​ మాత్రమేనని వివేక్​ వెంకటస్వామి అన్నారు. రోజూ మూడున్నర లక్షల కేసులు వస్తాయని ఎవరూ ఊహించలేదని చెప్పారు. 60 ఏండ్లు నిండినోళ్లందరికీ కేంద్ర ప్రభుత్వం ఫ్రీగా వ్యాక్సిన్​ ఇచ్చిందని గుర్తు చేశారు. దానిని రాష్ర్టాలు సరిగా వాడుకోలేదన్నారు. ప్రధాని నరేంద్ర మోడీలాగా సీఎం కేసీఆర్​ కూడా వ్యాక్సిన్​ వేసుకుని ఉంటే ప్రజల్లో భరోసా వచ్చేదన్నారు. సీఎం కేసీఆర్​ వ్యాక్సిన్​ వేసుకోకపోవడంతోనే రాష్ట్రంలో వ్యాక్సినేషన్​పై నిర్లక్ష్యం పెరిగిందని, 10 శాతం టీకాలు వృథా అయ్యాయని చెప్పారు. 

ఫ్రీ వ్యాక్సిన్లకు 2 వేల కోట్లియ్యలేరా?
వ్యాక్సినేషన్​పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని వివేక్​ వెంకటస్వామి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.36 వేల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టును రూ.1.25 లక్షల కోట్లకు పెంచినప్పుడు.. వ్యాక్సిన్లకు రూ.2 వేల కోట్లిస్తే వచ్చే నష్టమేంటని ఆయన ప్రశ్నించారు. సెక్రటేరియట్​ను కూల్చొద్దని ఆనాడే చెప్పానని, దానిని ఐసోలేషన్​ సెంటర్​గా మారిస్తే ప్రజలకు ఎంతో ఉపయోగపడేదని అన్నారు. డిజాస్టర్​ మేనేజ్​మెంట్​ చట్టం కింద రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అన్ని అధికారాలూ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఆక్సిజన్​ ప్లాంట్ల ఏర్పాటు, రెమ్డెసివిర్​ ఉత్పత్తి కెపాసిటీ పెంపు, వెంటిలేటర్లు, టెస్టింగ్​ కిట్ల దిగుమతి వంటి వాటికి అనుమతులు ఇచ్చిందన్నారు. 30 ఆక్సిజన్​ ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్రం అనుమతిచ్చినా రాష్ట్ర సర్కార్​ చర్యలు చేపట్టలేదన్నారు.
 
ప్రచారంలో ఎడం పాటించట్లె
నాగార్జునసాగర్​లో ప్రచారానికి రావొద్దని అక్కడి వారు చెప్పినా వినిపించుకోకుండా సీఎం సభ పెట్టారని వివేక్​ వెంకటస్వామి విమర్శించారు. సాగర్​లో సభ పెట్టి సీఎం కేసీఆర్​ కరోనాను విపరీతంగా స్ప్రెడ్​ చేశారని ఫైర్​ అయ్యారు. ఎన్నికల ప్రచారాల్లో ఎక్కడా ఫిజికల్​ డిస్టెన్స్​ పాటించట్లేదన్నారు. కొందరు మాస్కులు పెట్టుకుంటున్నా.. ఇంకొందరు మాత్రం పెట్టుకోవట్లేదన్నారు. మున్సిపల్​ ఎన్నికలను వాయిదా వేస్తే బాగుండేదని చెప్పుకొచ్చారు.
 
రాష్ట్రం చేతిలోనే హాస్పిటల్స్​ వ్యవస్థ
హాస్పిటళ్ల వ్యవస్థ అంతా రాష్ట్ర సర్కార్​ చేతుల్లోనే ఉందని వివేక్​ వెంకటస్వామి అన్నారు. ఆయుష్మాన్​ భారత్​ను అమలు చేస్తే ఒక్కొక్కరికి రూ.5 లక్షల దాకా కరోనా సహా అన్ని ట్రీట్​మెంట్లు ఫ్రీగా అందే అవకాశం ఉండేదన్నారు. ఆయుష్మాన్​ భారత్​లో చేరుతున్నామంటూ ఇటీవల ప్రకటించినా.. ఇప్పటిదాకా ముందడుగు పడలేదని విమర్శించారు.