టీఆర్ఎస్ సర్కార్కు కౌంట్డౌన్ మొదలైంది

టీఆర్ఎస్ సర్కార్కు కౌంట్డౌన్ మొదలైంది
  • బీజేపీని ఎదుర్కోలేకనే కాంగ్రెస్తో కేసీఆర్ కుమ్మక్కు
  • సీఎం అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని ఫైర్

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ సర్కార్ కు  కౌంట్‌‌‌‌ డౌన్‌‌‌‌ మొదలైందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి అన్నారు. రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఢిల్లీ కోటలు బద్దలు కొడుతా.. జాతీయ స్థాయిలో గత్తర లేపుతా’’ అంటూ సీఎం కేసీఆర్ చేసే కామెంట్లన్నీ కాంగ్రెస్‌‌‌‌కు అనుకూలంగా, బీజేపీకి వ్యతిరేకంగా చేస్తున్నవేనని తాజా చర్యలతో తేటతెల్లమైందన్నారు. రాష్ట్రంలో బీజేపీని ఎదుర్కోలేకనే కాంగ్రెస్‌‌‌‌తో కేసీఆర్ అనైతిక బంధం కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. అవకాశవాద రాజకీయాలు చేస్తున్న కేసీఆర్‌‌‌‌కు వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. ‘‘రాష్ట్రంలో కాంగ్రెస్‌‌‌‌తో కొట్లాడుతున్నామని చెబుతున్న కేసీఆర్.. జాతీయ స్థాయిలో మాత్రం ఆ పార్టీతో జట్టు కట్టారు. కాంగ్రెస్‌‌‌‌, బీజేపీకి ప్రత్యామ్నాయంగా రాజకీయ వేదిక ఏర్పాటు చేస్తామంటూ పదే పదే చెప్తున్న కేసీఆర్‌‌‌‌.. రాష్ట్రపతి ఎన్నికలో మాత్రం కాంగ్రెస్ తో కలిసి యశ్వంత్‌‌‌‌ సిన్హాకు మద్దతు పలుకుతున్నారు” అని విమర్శించారు. కేసీఆర్‌‌‌‌ గిరిజన అభ్యర్థికి మద్దతు ఇవ్వకుండా ఎస్టీలపై తనకున్న వ్యతిరేకతను చాటుకున్నారని వివేక్ మండిపడ్డారు. 

కేసీఆర్‌‌‌‌కు ప్రజలే బుద్ధి చెప్తరు: విజయశాంతి 
కేసీఆర్ లాంటి నేతలకు తెలంగాణ ప్రజలే బుద్ధి చెబుతారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి అన్నారు. జాతీయ స్థాయిలో కేసీఆర్ ను ఎవరూ నమ్మే పరిస్థితి లేదన్నారు. ఆమె ఎయిర్ పోర్టులో మీడియాతో మాట్లాడారు. ‘‘కేసీఆర్ కు ఇక్కడే దిక్కు లేదు. జాతీయ స్థాయిలో ఏం చేస్తారు. రాష్ట్రంలోనే టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ కనుమరుగు అవుతోంది.  ఆ పార్టీ పరిస్థితి ఆరిపోయే దీపంలా ఉంది. ఇక బీఆర్ఎస్ ఎక్కడిది?” అని విజయశాంతి విమర్శించారు. బీజేపీ సమావేశాలతో టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నేతలకు వణుకు పుడుతోందన్నారు. టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌, కాంగ్రెస్‌‌‌‌, ఎంఐఎం అంతా ఒక్కటేనని ఆరోపించారు. కేసీఆర్ ఎస్టీలకు వ్యతిరేకమని మండిపడ్డారు. ‘‘కేసీఆర్‌‌‌‌ రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించట్లేదు. స్వార్థమే చూసుకుంటున్నారు. తెలంగాణ వచ్చింది కేసీఆర్‌‌‌‌ కుటుంబం కోసం కాదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చారు” అని ఫైర్ అయ్యారు. రాష్ట్రాభివృద్ధి జరగాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు.  

టీఆర్​ఎస్​ ఎన్ని కుట్రలు చేసినా ప్రజల అండ బీజేపీకే: కిషన్​రెడ్డి
టీఆర్ఎస్  ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని కుట్రలు చేసినా ప్రజల అండ బీజేపీకే ఉంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శుక్రవారం బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కె.లక్ష్మణ్‌‌‌‌, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్​ వెంకటస్వామితో కలిసి హైదరాబాద్‌‌‌‌లోని పరేడ్ గ్రౌండ్​లో ప్రధాని మోడీ బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కిషన్​రెడ్డి మాట్లాడుతూ.. పండుగ వాతావరణంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. టీఆర్​ఎస్​ ప్రభుత్వం అనేక రకాల అవరోధాలు కల్పిస్తున్నదని, తప్పుడు సందేశాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నదని, ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నదని ఆయన మండిపడ్డారు. అన్ని వర్గాల ప్రజలు మోడీ బహిరంగ సభ కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. బీజేపీ కార్యకర్తలు 15 ప్రత్యేక ట్రైన్లు, వందలాది బస్సులు ఏర్పాటు చేసుకుని స్వచ్ఛందంగా బహిరంగ సభకు తరలివస్తున్నారని అన్నారు. దేశంలో తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్నో సంక్షేమ పథకాలు విజయవంతం అయ్యాయని ఆయన తెలిపారు. లక్ష్మణ్​ మాట్లాడుతూ.. కేసీఆర్ సర్కార్ పతనం అంచున ఉందని, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్లు టీఆర్ఎస్  పరిస్థితి ఉందని పేర్కొన్నారు. మహారాష్ట్రలో పుత్ర వాత్సల్యంతో శివసేన ఎలా కనుమరుగైందో, తెలంగాణలో టీఆర్ఎస్ కూడా పుత్ర వాత్సల్యంతో పతనం అవుతుందన్నారు.