మేడారం భక్తులకు ఇబ్బందుల్లేకుండా సర్కార్ ​ఏర్పాట్లు : వివేక్​ వెంకటస్వామి

మేడారం భక్తులకు ఇబ్బందుల్లేకుండా సర్కార్ ​ఏర్పాట్లు :  వివేక్​ వెంకటస్వామి
  • చెన్నూరులో మేడారం జాతర స్పెషల్ బస్సుల ప్రారంభం

కోల్​బెల్ట్/చెన్నూరు, వెలుగు: మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా కాంగ్రెస్ సర్కార్​ఏర్పాట్లు చేసిందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ ​వెంకటస్వామి అన్నారు. చెన్నూరు బస్టాండ్​ఆవరణలో టీఎస్​ ఆర్టీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర స్పెషల్​ బస్సులను ఆదివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేద ప్రజలు మేడారం జాతరకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులపై ఆధారపడుతారని, వారు సంతోషంగా సమ్మక్క, సారలమ్మ తల్లులను దర్శించుకునేందుకు ప్రభుత్వం తోడ్పడుతోందన్నారు. భక్తుల సౌకర్యార్థం ఆడిగిన చోట బస్సులను ఆపాలని, లగేజ్​లు ఉన్నా ఆర్టీసీ అధికారులు సహకరించాలని సూచించారు. జాతర కోసం గత ప్రభుత్వం 55 బస్సులను మాత్రమే నడిపిందని, ఈ సారి 85 స్పెషల్​ బస్సులను భక్తులకు అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు. 

రాత్రి పూట కూడా బస్సులను నడిపించేందుకు ఆర్టీసీ ప్రయత్నం చేయాలన్నారు. ఈ సందర్భంగా జెండా ఊపి జాతరకు తొలి బస్సును ప్రారంభించి భక్తులతో కలిసి కొద్దిసేపు బస్సులో ప్రయాణించారు. కార్యక్రమంలో ఆదిలాబాద్​ఆర్టీసీ రీజినల్​ మేనేజర్ సోలమాన్​రాజు, డిప్యూటీ ఆర్ఎంఓ ప్రణీత్ కుమార్, ఆర్​ఎంఎంఓ ప్రవీణ్​కుమార్, మంచిర్యాల, ఆదిలాబాద్​ డిపోల అధికారులు, కాంగ్రెస్​ లీడర్లు పాల్గొన్నారు.

రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే.. 

రూ.5లక్షల ఎన్ఆర్​జీఎస్​ ఫండ్స్​తో కోటపల్లి మండలం నక్కలపెల్లి గ్రామం ఎస్టీ కాలనీలో నిర్మించనున్న సీసీ రోడ్డుకు ఎమ్మెల్యే వివేక్ ఆదివారం సాయంత్రం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లా ఇన్​చార్జ్, మంత్రి సీతక్క చెన్నూరు నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి రూ.5.40 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. 

15, 20 రోజుల్లో పనులు పూర్తిచేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. అనంతరం మండలంలోని మల్లంపేట గ్రామ శివారులో ఉన్న సమ్మక్క–సారలమ్మ గద్దెలకు కొబ్బరికాయలు కొట్టి జాతరను ప్రారంభించారు. కోటపల్లి మండల కేంద్రం, మల్లంపేట మధ్యలోని వారెళ్ల వాగు కాజ్​వేను పరిశీలించారు. బ్రహ్మనపల్లిలో శివాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేసి గుడికి రూ.50వేల విరాళం ప్రకటిం చారు. గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారానికి బోరు తవ్విస్తానని హామీ ఇచ్చారు. 

బాధిత కుటుంబానికి పరామర్శ 

కోటపల్లి మండలం నక్కలపల్లి సర్పంచి అశోక్​ బంధువు తోట మొండయ్య ఇటీవల అనారో గ్యంతో మృతి చెందగా బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు. ఆయన వెంట ఉమ్మడి జిల్లా జడ్పీ మాజీ వైస్​ చైర్మన్​ మూల రాజిరెడ్డి, ఐత హేమంతరెడ్డి, సిర్సా బాపిరెడ్డి, పోటు రాంరెడ్డి, సుధాకర్​రెడ్డి, మహేశ్​తివారి, కట్రాల మల్లయ్య తదితరులున్నారు.